ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై చర్చ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో హాట్ హాట్ చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఓ దశలో సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ ఇలాంటి బఫూన్లను సభ నుంచి సస్పెండ్ చేసినా తప్పులేదని సూచన చేస్తున్నా అని టీడీపీ సభ్యులనుద్దేశించి వ్యాఖ్యానించారు. అంతకు ముందు చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు ఏదైనా న్యాయం చేసింది అంటే అది టీడీపీ ప్రభుత్వంలోనే అని.భవిష్యత్ లో చేయబోయేది కూడా తామే అని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీల కోసం తాము పోరాడుతున్నామని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ..పనులు గడప దాటడంలేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అంటూ నాడు సీఎం హోదాలో చంద్రబాబు పేర్కొన్నారని, ఒక సీఎం స్థాయి వ్యక్తులే ఈరకంగా మాట్లాడితే ఇక కిందిస్థాయి వ్యక్తులు ఎలా దళితులను గౌరవిస్తారని ఆయన ప్రశ్నించారు.
రాజధాని విషయంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చంద్రబాబు ఏరకంగా అన్యాయం చేశారో సీఎం వైఎస్ జగన్ సభకు వివరించారు. ఎస్సీ, ఎస్టీలకు రెండు ప్రత్యేక కమిషన్లను ఏర్పాటుచేసే బిల్లుపై సభా నాయకుడిగా, సీఎంగా వైఎస్ జగన్ సోమవారం అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తూ.. సీఎం ప్రసంగానికి అడ్డుపడ్డారు. తన మాటలు ప్రజల వద్దకు వెళ్లవద్దనే దురుద్దేశంతోనే టీడీపీ సభ్యులు అరుస్తున్నారని, ఇటువంటి దారుణమైన పనులు చేయిస్తున్న వ్యక్తి చంద్రబాబు తప్ప ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండబోరేమోనని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప వేరే మాటలు రావని, ఏపీ స్టేట్ కమిషన్ గురించి బాబు మాట్లాడుతూ.. 2003లోనే తాము ఎస్సీ కమిషన్ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఘాటుగా స్పందించారు.
నిజానికి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీస్ 1992లోనే వచ్చిందని, 1994-95 మధ్యకాలంలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 2004 ఎన్నికలకు ముందు రాజకీయ ఆలోచనతో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను తీసుకొచ్చారని, 1992లో జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ వస్తే.. 2003దాకా రాష్ట్రంలో అలాంటి కమిషన్ తీసుకురావాలన్న ఇంగితజ్ఞానం, సిగ్గూశరం లేకుండా చంద్రబాబు అప్పట్లో పరిపాలించారని మండిపడ్డారు. ‘ఎంచి చూడగా మనుషులందున మంచిచెడులు రెండే కులములు మంచి అన్నది మాల అయితే నేను ఆ మాలనవుతాను’ అని వంద సంవత్సరాల కిందట గురజాడ అప్పరావు అంటే.. దళితులుగా పుట్టాలని ఎవరునుకుంటారంటూ ఇప్పడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు సీఎం అయిన తర్వాత పేర్కొన్నారని విమర్శించారు. చంద్రబాబుకు ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత కూడా లేదని దుయ్యబట్టారు.