కడప స్టీల్ పై కీలక ముందడుగు

Update: 2019-11-08 12:58 GMT

కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి కీలక పరిణామం. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన ముడిసరుకు అంటే ఐరన్ ఓర్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) అంగీకరించింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వంలో త్వరలోనే ఎన్ఎండీసీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. అయితే ఈ ప్రాజెక్టు డెవలపర్ గా ఎవరు ముందుకు వస్తారనేది ఇక తేలాల్సి ఉంది. అత్యంత కీలకమైన ఐరన్ ఓర్ సరఫరాకు మార్గం సుగమం కావటంతో కడప స్టీల్ ప్లాంట్ కల సాకారం అయ్యేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయనే చెప్పాలి. శుక్రవారం నాడు అమరావతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో వివిధ చమురు కంపెనీల ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చమురు కంపెనీలకు రాష్ట్రంలో వనరుల ఆదాయాల మేరకు సీఎస్‌ఆర్‌ నిధులు చెల్లించాలని నిర్ణయించారు. తూర్పు గోదావరిలోని ముమ్మిడివరం ప్రాంతంలో మత్య్సకారులకు చెల్లించాల్సిన రూ. 81 కోట్లను త్వరలో చెల్లిస్తామని ఈ సందర్భంగా ఓఎన్‌జీసీ అంగీకరించింది. కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్‌ ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో అత్యున్న స్థాయి కమిటీ ఏర్పాటు కానుంది. వచ్చే ఐదేళ్లలో ఏపీలో పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు రంగాల నుంచి రూ. 2లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం అయినా అందించటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు జగన్ తెలిపారు.

Similar News