ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు సీఎం జగన్ డిక్లరేషన్ అడగటానికి చంద్రబాబు ఎవరు అని ప్రశ్నించారు.. వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటే బిజెపి, టీడీపీ సభ్యత్వాలు ఉండాలా? అని కొడాలి నాని ప్రశ్నించారు. జగన్ ను డిక్లరేషన్ అడగటానికి వెంకటేశ్వరస్వామి గుడి చంద్రబాబు అమ్మ మొగుడు కట్టించారా అని వ్యాఖ్యానించారు. ఏపీలో ఎవరికీ రాని అవకాశం వైఎస్ ఫ్యామిలీకి వచ్చిందని అన్నారు. దివంగత రాజశేఖరరెడ్డితోపాటు ఇఫ్పుడు జగన్ కూడా వెంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం దేవుడే కల్పించారని అన్నారు. మరి ఆ అవకాశం చంద్రబాబు తర్వాత నారా లోకేష్ కు ఎందుకు రాలేదు?. మిగిలిన ముఖ్యమంత్రుల కుమారులకు ఎందుకురాలేదన్నారు.
ఇది ఒక్క వైఎస్ ఫ్యామిలీకి మాత్రమే దక్కిందని తెలిపారు. చంద్రబాబు మాట్లాడితే వెంకటేశ్వరస్వామిని కులదేవం..కులదేవం అంటాడు. కమ్మకులంలో పుడితేనే వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని చెబుతారా?. ఇతర కులాల వారికి అవకాశం ఉండదా అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా కూడా జగన్ పలుమార్లు వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారని తెలిపారు. చంద్రబాబు, పప్పుకు కమిషన్లు ఇవ్వటమే దేవినేని ఉమా పని అని విమర్శించారు కొడాలి నాని. చంద్రబాబు డిక్లరేషన్ గురించి మళ్లీ ప్రస్తావిస్తే మళ్ళీ మళ్ళీ తిడతానంటూ వ్యాఖ్యానించారు కొడాలి నాని. తమ వల్లే ఎన్టీఆర్ పార్టీకి దూరం అయ్యారని అంటున్నారు కదా?. మరి నేను, వంశీ పార్టీని వీడాం..ఇప్పుడు ఎన్టీఆర్ కు అధ్యక్ష పదవి అప్పగిస్తారా? అని కొడాలి నాని ప్రశ్నించారు. కులదేవం అని చెప్పుకునే చంద్రబాబు తన తనయుడునారా లోకేష్, దేవాన్ష్ లు వెంకన్న పేరు ఎందుకు పెట్టలేదన్నారు.