అమరావతి ‘అసైన్డ్’ రైతులకు అన్యాయం ఇప్పుడే గుర్తొచ్చిందా?

Update: 2019-11-28 11:07 GMT

ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి అమరావతి పర్యటన అనగానే ‘అమరావతి అసైన్డ్ రైతులకు’ అన్యాయం గుర్తొచ్చిందా?. టీడీపీ నేతలు అమరావతిలో పర్యటించినప్పుడు వీళ్ళెవరూ పెద్దగా స్పందించలేదు. ఏ సందర్భంలోనూ వీరు నిరసనలు వ్యక్తం చేయలేదు. ఏపీలో కొత్తగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీరు ఏమైనా ప్రభుత్వానికి తమకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేశారా? అంటే లేదనే సమాధానం వస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళలోనే సీఎం జగన్ అమరావతి అక్రమాలు..అన్యాయాలపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. మరి ఆ సమయంలో అయినా వీరు తమకు జరిగిన అన్యాయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళాలి కదా?. కానీ ఎందుకు తీసుకెళ్ళలేదు. కానీ సడన్ గా చంద్రబాబునాయుడు అమరావతి పర్యటన అనగానే ఇంత భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం చేయటం వెనక కారణాలు ఏంటి?. అంటే ఖచ్చితంగా రాజకీయ కారణాలే పైకి కన్పిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నష్టపోయిన అగ్రిగోల్డ్ బాధితులతోపాటు ఎంతో మందికి న్యాయం చేశామని వైసీపీ సర్కారు చెబుతోంది.

కానీ వైసీపీ సర్కారు బాధితుల జాబితాలో ఎప్పుడూ అమరావతి అసైన్డ్ భూముల యాజమానులు లేరు. కానీ సడన్ గా చంద్రబాబు అమరావతి పర్యటన అనగానే వందల మంది రైతులు వచ్చి ధర్నాలు..నిరసన ప్రదర్శనలు చేయటం వెనక మతలబు ఏమిటి?. ఇది ఒకెత్తు అయితే పోలీసు ఉన్నతాధికారులు చంద్రబాబు టూర్ పై చేసిన వ్యాఖ్యలు మరీ విచిత్రంగా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉండగా జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తితో దాడి జరిగినప్పుడు అప్పటి డీజీపీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి..జగన్ పై దాడి చేసింది వైసీపీ అభిమానే అని ప్రకటించి పెద్ద దుమారానికి కారణం అయ్యారు. ఇప్పుడూ కూడా అదే తరహాలో చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పు వేసిన వ్యక్తి రైతు అని..రాళ్ళు విసిరిన వ్యక్తి రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి తాను నష్టపోయినట్లు చెబుతున్నారని పోలీసులు చెప్పటం అంటే అంతకు మించిన దారుణం మరొకటి ఉండదు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఏపీలో రాజకీయాలు రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకరంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి.

 

 

 

 

 

 

Similar News