చర్చలపై కోర్టు సూచనలూ బేఖాతరు!

Update: 2019-10-19 07:14 GMT

‘ఆర్టీసి కార్మిక సంఘాలతో శనివారం ఉధయం పదిన్నర గంటలకు చర్చలు ప్రారంభించాలి.’ ఇదీ హైకోర్టు సూచన. కానీ సర్కారు మాత్రం ఈ సూచనను పెద్దగా పరిగణనలోకి తీసుకున్నట్లు కన్పించటంలేదు. పదిన్నర అయిపోయింది..పన్నెండున్నరకు కూడా చర్చలకు సంబంధించి సర్కారు నుంచి కానీ..ఆర్టీసి యాజమాన్యం నుంచి కానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అంటే రెండవ సారి కూడా తెలంగాణ సర్కారు హైకోర్టు సూచనలను బేఖాతరు చేసినట్లే కన్పిస్తోంది. గతంలో కూడా కోర్టు ఓ సారి ఆర్టీసికి పూర్తి స్థాయి ఎండీని నియమించటంతోపాటు కార్మికులతో చర్చలు జరపాలని సూచించింది. అయితే తమకు కోర్టు సూచన మాత్రమే చేసింది తప్ప..ఆదేశాలు కాదు కనక తాము వాటిని పాటించాల్సిన అవసరం లేదనే ధోరణితో సర్కారు ముందుకు సాగుతోంది. ఈ పరిణామాలు తెలంగాణలో అత్యంత ఉత్కంఠ రేపుతున్నాయి.

ఓ వైపు ఏభై వేల ఆర్టీసి కుటుంబాలు జీతాలు లేక...సమస్యలతో ఉంటే..మరో వైపు ప్రజలు సరైన రవాణా సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. విద్యార్ధులు కూడా స్కూళ్ళు..కాలేజీలకు సెలవులతో విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. కానీ సర్కారు ఇవేమీ పట్టించుకోకుండా..చివరకు కోర్టు సూచనలను కూడా విస్మరించి ముందుకు సాగుతుండటంతో ప్రజల్లో ఒకరకమైన అసహనం వ్యక్తం అవుతోంది. కోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాతే స్పందిస్తామన్న తీరులో సర్కారు ఉంది. మరి శనివారం సాయంత్రానికి అయినా సర్కారు వైఖరిలో మార్పు వస్తుందా?లేదా అన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఈ సారి కూడా సర్కారు చర్చలకు సిద్ధపడకపోతే కోర్టు స్పందన ఎలా ఉంటుంది అన్న ఆసక్తి అన్ని వర్గాల్లో నెలకొంది.

 

 

 

Similar News