చంద్రబాబుకు ‘జడ్జిమెంట్ ఆఫ్ ఎర్రర్’ అలవాటే!

Update: 2019-10-12 05:14 GMT

టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తప్పు చేశారంటే అర్ధం చేసుకోవచ్చు. ఆయన తప్పులే చేస్తున్నారు అన్నా ఓకే అనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో నారా లోకేష్ కు పెద్దగా అనుభవం లేదు కాబట్టి. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా..తనకు తాను గొప్ప విజనరీ అని..తనంత ముందు చూపుతో ఆలోచించే వాడే లేడని ప్రకటించుకునే చంద్రబాబు ఇంకా అలా చేయకపోతే బాగుండేది..ఇలా చేస్తే బాగుండేది అని చెప్పుకోవటం అంటే అది ఎవరితప్పు?. ఇప్పుడు తాజాగా చంద్రబాబు తన తప్పులను జాబితాను ప్రజల ముందు పెడుతున్నారు. దీని వల్ల ఫలితం ఏమైనా ఉంటుందా?. 2018లో ఫిబ్రవరిలో ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కెసీఆర్ కు మంత్రి పదవి ఇవ్వకపోవటం తప్పే. జడ్జిమెంట్ ఆఫ్ ఎర్రర్ వల్ల అది జరిగింది.’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చాలా తేలిగ్గా ఆ మాట చెప్పగలిగారు. కానీ చంద్రబాబునాయుడి తప్పు నిర్ణయం వల్ల ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే విడిపోయింది. కెసీఆర్ కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే తర్వాత అయినా ఉద్యమం వచ్చేదా..రాదా అంటే చెప్పటం కష్టమే కానీ..చంద్రబాబు తప్పుడు నిర్ణయం వల్ల మాత్రం రాష్ట్ర విభజన జరిగిందని చెప్పకతప్పదు.

ఇప్పుడు చంద్రబాబు మరో కొత్త తప్పు గురించి చెబుతున్నారు. మోడీతో..కేంద్రంతో విభేదించి నష్టపోయామనే కొత్త సూత్రీకరణను తీసుకొచ్చారు. పట్టుదలకు పోకుండా ఇబ్బందులు వచ్చి ఉండేవి కావని విశాఖపట్నంలో పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. ఇప్పుడు మోడీతో ఘర్షణ పడకుండా ఉండే బాగుండేది అంటన్నారు. మరికొన్ని రోజులు పోయిన తర్వాత ‘‘అమరావతిలో శాశ్వత భవనాలు కట్టకుండా తప్పు చేశా’. వచ్చిన ఏడాది నుంచే పోలవరంపై ఫోకస్ పెట్టి ఇప్పటికే పూర్తి అయ్యేది. ఎమ్మెల్యేల అవినీతిని కట్టడిచేస్తే సరిపోయేది. జన్మభూమి కమిటీల ఆగడాలను అడ్డుకుని ఉండాల్సి. ఇసుక దోపిడీని అరికట్టి ఉండాల్సింది’ అంటూ తప్పుల జాబితాను ప్రకటిస్తారేమో. అయినా ఇప్పుడు ఎన్ని ప్రకటించినా..ఏమి ప్రకటించినా వాటి వల్ల ఫలితం ఉండదు. దేశంలో అత్యంత సీనియర్ నేతగా తనకు తాను ప్రకటించుకున్న చంద్రబాబు ఇప్పుడు తాపీగా తప్పులు చేశానని చెపితే ఎవరు నమ్ముతారు?. మరి ఆయనకు ఉన్న అనుభవం అంతా ఎటుపోయినట్లు?. ఆయన ఎవరి మాటలు నమ్మి ముందుకు సాగినట్లు?.

 

Similar News