వర్షం అంటే వణుకుతున్న హైదరాబాద్

Update: 2019-09-25 13:29 GMT

వర్షం పేరు చెపితేనే నగర వాసులు హడలిపోయే పరిస్థితి. గత రెండు రోజులుగా ఏదో షెడ్యూల్ పెట్టుకుని వచ్చినట్లు సాయంత్రం కాగానే వర్షం కుమ్మేస్తోంది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళు పూర్తిగా మునిగిపోగా..రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. అంతే కాదు..వర్షం దెబ్బకు నగరమంతా ట్రాఫిక్ లో విలవిలలాడుతోంది. మంగళవారం రాత్రి ఇదే పరిస్థితి ఎదుర్కొన్న నగర వాసులకు బుధవారం నాడు కూడా తిప్పలు తప్పలేదు. బుధవారం సాయంత్రం కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దంటూ అధికారులు సూచనలు చేశారు.

బుధవారం సాయంత్రం ముషిరాబాద్‌, ఖైరతాబాద్, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు, చిక్కడపల్లి, హిమాయత్‌నగర్‌, అబిడ్స్‌, కోఠీ, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్‌, మీర్‌పేట్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుసింది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కురుస్తుండటంతో ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 

Similar News