చంద్రబాబు కట్టలేదన్నారు..మరి జగన్ కూడా అంతేనా!

Update: 2019-08-07 04:25 GMT

ప్రతిపక్షంలో ఉండగా జగన్ ప్రతి మీటింగ్ లో చెప్పిన మాట శాశ్వత రాజధానికి చంద్రబాబు ఒక్క ఇటుక కూడా వేయలేదు. జగన్ తోపాటు వైసీపీ నేతలు కూడా ఇదే మాటను విస్తృత ప్రచారం చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు దారుణ ఓటమికి అమరావతిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టకపోవటం ఒకెత్తు అయితే..అమరావతిపై అతి ప్రచారంచేసుకోవటం కూడా ఒకటి. అమరావతిలో శాశ్వత రాజధాని కట్టలేదని పదే పదే చెప్పిన జగన్ అధికారంలోకి వస్తే ఎవరైనా రాజధాని కడతారనే అనుకుంటారు. కానీ అప్రతిహత మెజారిటీతో అధికారం దక్కించుకున్న జగన్ అమరావతి విషయంలో మాత్రం ఎవరికీ అర్ధం కాకుండా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్లాన్ లను యతాదధంగా అమలు చేయాలని ఎవరూ కోరరు. కానీ అక్కడ అయితే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్ భవన్ వంటి శాశ్వత నిర్మాణాలు అయితే చేయాలి కదా?. కానీ జగన్ ఈ అంశాలను పక్కన పెట్టి ‘విచారణ’ తర్వాతే ఏదైనా అన్న తరహాలో ముందుకెళుతున్నారు. చంద్రబాబు చేసిన ప్రతి పని అక్కడ ఫైళ్ళలో నిక్షిప్తమై ఉంటుంది.

అందులో నుంచి అక్రమాలు ఎక్కడికీ పోవు. జగన్ ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు. కానీ ప్రతిపక్షంలో ఉండగా రాజధాని కట్టలేదు..కట్టలేదు అని మాట్లాడి ఇప్పుడు అసలు రాజధానికి సంబంధించి ప్రణాళికలు, ఈ దిశగా చర్యలు చేపట్టకపోవటంతో అమరావతిలో అంతా అనిశ్చితి రాజ్యమేలుతుంది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయితే ఓ సారి తమకు నిధుల వెసులుబాటును బట్టి అమరావతి నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అంటే చంద్రబాబును రాజధాని కట్టలేదని విమర్శించి అధికారంలోకి వచ్చిన వైసీపీ..రాజధానిపై అలాంటి స్టాండ్ తీసుకోవటం సమర్ధనీయమేనా?. ఇప్పుడు తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీకి ఇఛ్చిన వినతిపత్రంలో రాజధానికి నిధుల విషయంపై తర్వాత అడుగుతామని చెప్పటం అంటే ఈ ప్రాజెక్టును పక్కనపెట్టినట్లే కన్పిస్తోంది. అధికారంలోకి వచ్చి ఫైళ్ళు అన్నీ చేతిలో పెట్టుకుని..అవి తేలేవరకూ ఇక పనులు ఏమీ చేయం అన్న తరహాలో వ్యవహరించటం విచిత్రంగా ఉందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

Similar News