ఆటకు అంబటి రాయుడు గుడ్ బై

Update: 2019-07-03 14:26 GMT

తెలుగు ఆటగాడు క్రికెట్ రాజకీయాలకు బలయ్యాడు. ఆటలో మంచిగా రాణిస్తున్నా రాయుడికి మాత్రం అవకాశాలు రాలేదు. ఏ ఆటగాడు అయినా ప్రపంచ కప్ వంటి అత్యంత ప్రతిష్టాత్మక ఆటలో ఆడాలని కోరుకుంటాడు. అంబటి రాయుడు కూడా అదే ఆశించాడు. కానీ ఆటలో రాజకీయాలు ఆయనకు ఆ అవకాశం రాకుండా చేశాయి. దీనికి రాయుడి దూకుడు స్వభావం కూడా ఒకింత కారణం అనే అభిప్రాయం ఉంది. ఏది ఏమైనా తీవ్ర అసంతృప్తికి గురైన రాయుడు క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఐపీఎల్‌ సహా అన్ని ఫార్మాట్లకూ వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ప్రపంచకప్‌లో చోటు ఖాయమని చివరకు ఊరించిన అవకాశం కాస్త విజయ్‌ శంకర్‌ రూపంలో తన్నుకుపోవడంతో ఈ హైదరాబాదీ క్రికెటర్‌ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

స్టాండ్‌బై ఆటగాడిగా ఉన్న కూడా ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడంతో రాయుడు కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే బుధవారం అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ కెరీర్‌కు రాయుడు స్వస్తి పలుకుతున్నట్లు తెలుస్తోంది. రాయుడు కంటే విజయ్‌ శంకరే మూడు రకాలుగా ఉపయోగపడతాడన్న చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వ్యాఖ్యలపై రాయుడు వ్యంగ్యంగా స్పందించాడు. ప్రపంచకప్‌ మ్యాచ్ లు చూసేందుకు తాను త్రీడి కళ్లద్దాలు ఆర్డర్‌ ఇచ్చానని రాయుడు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడం చర్చనీయాంశమైంది. జట్టులో నాలుగో స్థానానికి ఎంపికైన విజయ్‌ శంకర్‌ గాయం నుంచి తప్పుకున్నా... అదే స్థానానికి చివరి వరకు పోటీ పడిన రాయుడుకు మాత్రం మరోసారి మొండిచేయి ఎదురైంది. ప్రపంచ కప్‌ స్టాండ్‌ బై ఆటగాళ్లలో అతని పేరు ఉన్నా, అసలు సమయానికి మాత్రం ఆ చాన్స్‌ మయాంక్ కు దక్కింది.

పునరాగమనం తర్వాత నిలకడైన ప్రదర్శనతో ‘4’కు సరైనవాడు అని కోహ్లితో ప్రశంసలు పొందినా...న్యూజిలాండ్‌ గడ్డపై భారత టాప్‌ స్కోరర్‌గా నిలిచినా రాయుడును సెలక్టర్లు గుర్తించలేదు. దీంతొ తీవ్రమనస్థాపానికి గురైన రాయుడు తన ఆటకు వీడ్కోలు పలికాడు. 55 వన్డేలాడిన ఈ హైదరాబాదీ బ్యాట్స్‌ మన్‌ 47.05 సగటుతో 1694 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 10 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్‌ 124. ఇ‍క తన 17 ఏళ్ల ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 16 సెంచరీలు, 34 హాఫ్‌ సెంచరీలతో 6151 పరుగులు చేశాడు. లిస్ట్‌-ఏలో 160 మ్యాచులాడి 5,103 పరుగులు చేశాడు. టీ20ల్లో 1 సెంచరీ, 24 హాఫ్‌ సెంచరీలతో 4,626 పరుగులు సాధించాడు. ప్రపంచకప్‌ సన్నాహకంలో భాగంగా ఎంపికైన రాయుడు పరిమిత ఓవర్లపై మరింత శ్రద్ధ పెట్టడం కోసమం ఫస్ట్‌ క్లాస్‌క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పాడు. ఆసీస్, కివీస్‌ పర్యటనల్లో 82.25 స్ట్రయిక్‌రేట్‌తో రాణించాడు. కానీ రాయుడికి అవకాశం మాత్రం దక్కలేదు. 2013 జులై 24న టీమిండియా-జింబాబ్వే మధ్య జరిగిన వన్డేల్లో అరంగేట్రం చేసిన రాయుడు.. చివరగా ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ఆడాడు. 2014లో తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడాడు. 2016లో జింబాబ్వేతో జరిగిన టీ20నే అతడికి ఆఖరిది. ఈ ఏడాది మార్చిలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున చివరిసారిగా ఆడాడు.

 

Similar News