ఆర్ పీజి గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకా సంచలనం

Update: 2024-05-05 13:04 GMT

గత కొన్ని సంవత్సరాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకెళుతున్నాయి. దీంతో అటు బిఎస్ ఈ, ఎన్ ఎస్ఈ సూచీలు కొత్త కొత్త గరిష్ట స్థాయిలు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆర్ పీజి గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా చేసిన ట్వీట్ పెద్ద సంచలనంగా మారింది. స్టాక్ మార్కెట్ బూమ్ లో మళ్ళీ హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ తరహా మోసాలు ప్రారంభం అయ్యాయని తెలిపారు. ముఖ్యంగా కోల్ కతా కేంద్రంగా ఇది సాగుతుంది అని వెల్లడించారు. కొంతమంది ప్రమోటర్లు గుజరాతి-మార్వారీ బ్రోకర్లతో కుమ్మక్కు అయి లాభాలు ఎక్కువ చేసి చూపించి తమ తమ షేర్లను అసాధారణ ధరలకు పెంచుతున్నారు అని ఆరోపించారు. సెబీ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు జోక్యం చేసుకుని విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న ఇన్వెస్టర్లు భారీగా నష్టపోక ముందు ఈ పని చేయాలని అయన కోరారు. ఇదే ఇప్పుడు అటు పారిశ్రామిక వర్గాలతో పాటు స్టాక్ మార్కెట్ వర్గాల్లో కూడా ప్రకంపనలు రేపుతోంది. హర్ష్ గోయెంకా ట్వీట్ ప్రభావం వచ్చే వారం మర్కెట్స్ పై ఉండే అవకాశం ఉంది అని భావిస్తున్నారు.

                                                              దేశంలో స్టాక్ మార్కెట్ బూమ్ కు ఆర్థిక వ్యవస్థలోని సానుకూల సంకేతాలే కారణాలే అని కేంద్రంలోని మోడీ సర్కారు చెపుతోంది. ఈ తరుణంలో హర్ష్ గోయెంకా ట్వీట్ దుమారం రేపుతోంది అనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు హర్ష్ గోయెంకా ట్వీట్ పై అటు ఆర్థిక శాఖ కానీ..సెబీ కానీ స్పందించలేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా దేశంలో పెద్ద పెద్ద పరిశ్రమలు నడిపే పారిశ్రామిక వేత్త ఇంతటి సంచలన వ్యాఖ్యలు చేయరనే విషయం తెలిసిందే. కేంద్రంలోని మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఎవరూ నోరు విప్పటానికి కూడా సాహసించలేని పరిస్థితులు ఉన్న తరుణంలో హర్ష్ గోయెంకా దీనిపై విచారణ జరిపించాలని కోరటం అంటే అంత ఆషామాషీ విషయం కాదు అని చెప్పొచ్చు. 1999 -2000 సంవత్సరాల కాలంలో కేతన్ పరేఖ్ అప్పటి బూమ్ కు అనుగుణంగా ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, ఎంటర్టైన్మెంట్ సెక్టార్ ల షేర్లలో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారు. 

                                                      Full Viewకేతన్ పరేఖ్ ఇన్వెస్ట్ చేసిన షేర్లలో మదుపర్లు కళ్ళు మూసుకుని పెట్టుబడి పెట్టేవారు. ఇన్వెస్ట్ మెంట్ సంస్థలు, ఓవర్సీస్ కార్పొరేషన్స్ ఇలా ఒకరేమిటి అందరూ గుడ్డిగా ఫాలో అయి బుక్ అయిన వాళ్లే. దీని వెనక పెద్ద ఆపరేటర్స్ ముఠా ఉన్నట్లు చెపుతారు. అంతకు ముందు అంటే 1990 ప్రారంభంలో హర్షద్ మెహతా స్కాం దేశీయ మార్కెట్ లను కుదిపేసిన విషయం తెలిసిందే. వ్యవస్థలోని లొసుగులను వాడుకుని అప్పటిలో హర్షద్ మెహతా ఈ స్కాం చేశారు. ఎంపిక చేసిన షేర్లలో స్టాక్ ప్రైస్ రిగ్గింగ్ కు పాల్పడి మోసాలు చేశారు. మరి హర్ష్ గోయెంకా చెపుతున్న స్కాములో అసలు విచారణ జరుగుతుందా...జరిగితే ఎవరి పేర్లు బయటికి వస్తాయో చూడాలి. అందరూ లోక్ సభ ఎన్నికల బిజీ లో మునిగి ఉన్న సమయంలో కేంద్రంలోని కీలక శాఖలు ఈ విషయంపై దృష్టి పెడతాయా..లేక చూసి చూడనట్లు వదిలేస్తాయా అన్నదే ఇప్పుడు కీలకం కానుంది.

Tags:    

Similar News