టీడీపీకి మాజీ మంత్రి ఝలక్..వైసీపీలోకి

Update: 2019-03-25 07:38 GMT

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనను మోసం చేశారని మాజీ మంత్రి, సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు ఆరోపించారు. కనీసం నరసాపురం సీటు కేటాయించే సమయంలో తమతో మాటమాత్రంగా కూడా మాట్లాడలేదని విమర్శించారు. ఇటీవలే జగన్ ను కలసిన ఆయన సోమవారం నాడు టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలపై తన అభిమానులు, కార్యకర్తల సమక్షంలో సంతకం చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ..‘ నాకు టికెట్‌ ఇవ్వకపోయినా బాధలేదు.

నమ్మకద్రోహం చేయడంతో నా ప్రజలు ఆవేదన చెందారు. నాతో పాటు పదిమంది కౌన్సిలర్లు, వేలాదిమంది కార్యకర్తలు టీడీపీకి రాజీనామా చేస్తున్నాం. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరతాం. మా సత్తా ఏంటో చూపిస్తాం. నర్సాపురంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాద్‌ రాజును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. నా ప్రతాపం పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో చూపిస్తాను. రెండు జిల్లాల్లో అత్యధిక సీట్లు గెలవడానికి నేను ప్రచారం చేస్తా.’ అని స్పష్టం చేశారు. టీడీపీ సర్కారు కొత్తపల్లి సుబ్బరాయుడికి కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కట్టబెట్టింది. అయినా సరే ఆయన తాజా పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో టీడీపీకి గుడ్ బై చెప్పారు.

 

Similar News