అందుకే రాజకీయాల్లోకి వచ్చా

Update: 2018-12-16 11:38 GMT

అమెరికా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ పలు సమావేశాలు పెట్టి తన లక్ష్యాలను వివరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నిజాయతీ, చిత్తశుద్ధి ఉన్న వాళ్ళను చట్టసభల్లో కూర్చోపెట్టేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. సభలో అలాంటి వారు ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. అలా కాకుండా డబ్బులు పెట్టి ఓట్లుకునేవారు..బెదిరింపులకు పాల్పడే వారి వల్ల ఎలాంటి మేలు జరగదన్నారు. ఇలాంటి వల్ల నిజాయతీపరులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ మార్చేందుకు ప్రవాసులు తమ వంతు చేయూతనివ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు. డాక్టర్లతో సమావేశం సందర్భంగా మాట్లాడుతూ తనకు రాజకీయం తెలియదని.. మానవత్వం మాత్రమే తెలుసునని అన్నారు. డబ్బుతో సమాజంలో మార్పు సాధ్యం కాదన్నారు.

తుదిశ్వాస వదిలేలోపు సమాజంలో ఎంతోకొంత మార్పు తీసుకొస్తానన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. హార్వర్డ్ నుంచి డాక్టర్లను పిలిపించామన్నారు. కానీ, ఈ రాజకీయ వ్యవస్థలో కిడ్నీ సమస్య పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్లలేకపోయామని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్ధానం సమస్య పరిష్కారానికి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని భావించినట్లు చెప్పారు. వైద్యులను భగవంతుడితో సమానంగా భావిస్తున్నామని, డాక్టర్లను జనసేన పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకొంటుందని పవన్ పేర్కొన్నారు.

 

Similar News