చంద్రబాబు ఒత్తిడితోనే సర్వే మార్చారు

Update: 2018-12-05 04:43 GMT

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి లగడపాటి రాజగోపాల్ వెల్లడించిన అంచనాలు పెద్ద రాజకీయ దుమారం రేపాయి. ప్రస్తుతం కూటమికి వాతావరణం అనుకూలంగా ఉందని లగడపాటి మంగళవారం నాడు హైదరాబాద్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ అగ్రనేతలు అందరూ స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడితోనే లగడపాటి రాజగోపాల్‌ తన సర్వే ఫలితాన్ని మార్చారని కేటీఆర్‌ ఆరోపించారు. లగడపాటి సర్వేను ఆయన తప్పుపట్టారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి 65–70 సీట్లు వస్తాయంటూ గత నెల 20న లగడపాటి తనకు పంపిన మెసేజ్‌ను ఆయన మంగళవారం ట్విట్టర్‌లో బయటపెట్టారు.

సర్వే పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రను బయటపెట్టేందుకే తాను ఆ మెసేజ్‌ను షేర్‌ చేయాల్సి వచ్చిందని తెలిపారు. నవంబర్‌ 20 నాటికి ఉన్న పరిస్థితిని బట్టి ఆ ఫలితాలు చెప్పానని, కేసీఆర్‌ వ్యూహాలపై తనకు పూర్తి అవగాహన ఉన్నదని చెప్పిన లగడపాటి.. తన అంచనాలను మించి టీఆర్‌ఎస్‌ సీట్లు సాధించినా ఆశ్చర్యం లేదని అన్నారని కేటీఆర్‌ వెల్లడించారు. ఈ విషయం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ నిరూపితమైందని లగడపాటి కేటీఆర్‌కు పంపిన మెసేజ్‌లో పేర్కొన్నారు.

Similar News