కడప స్టీల్ ప్లాంట్ ‘పొలిటికల్ స్టంట్’!

Update: 2018-11-08 04:05 GMT

రాజధాని అమరావతిలో భవనాల నిర్మాణాలకే బాండ్స్ ద్వారా అత్యధిక వడ్డీతో 2000 కోట్ల రూపాయల అప్పు చేసిన ఏపీ సర్కారు 12000 కోట్ల రూపాయలతో కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయటం సాధ్యం అవుతుందా?. అందుకు ఏపీ సర్కారు వద్ద వనరులు అందుబాటులో ఉన్నాయా?. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన ఖనిజ సరఫరా, కనెక్టివిటి లేకుండా ఏ ప్రైవేట్ సంస్థ ఇంత భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తుంది. స్లీట్ ఏర్పాటుకు అత్యంత కీలకమైన ఇనుప ఖనిజం (ఐరన్ ఓర్) వనరులు ఎక్కడ ఉన్నాయి?. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంత తేలికైన వ్యవహారం కాదని పరిశ్రమల శాఖ వర్గాలు చెబుతున్నాయి. నాలుగు సంవత్సరాల పాటు ఎన్డీయేలో కలసి ఉన్నంత కాలం కడప స్టీల్ ప్లాంట్ గురించి పెద్దగా పార్లమెంట్ లో ప్రస్తావించని టీడీపీ ఎంపీలు..ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి మాత్రం ఎక్కడలేని ప్రేమ చూపించారు. అయినా వెనకబడిన జిల్లా అయిన కడపలో స్టీల్ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలోనే ఉంది.

ఓ వైపు కేంద్రంతో పోరాడుతున్నామని చెబుతూ...చట్టంలో ఉన్న చట్టబద్దమైన హక్కును కూడా వదులుకుని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించటంలోని ఔచిత్యం ఏమిటి?. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్టును ఏపీ ప్రభుత్వమే సొంతంగా ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉంటే అసలు కేంద్రంతో చంద్రబాబు సర్కారు ఘర్షణ పడాల్సిన అవసరం ఏముంది?. ప్రభుత్వం చేసుకోగలిగినవి అన్నీ చేసుకుని..మిగతా వాటికి మాత్రమే కేంద్రం నుంచి తెచ్చుకునే వెసులుబాటు చేసుకుంటే ఏ గొడవా ఉండదు కదా?. కానీ ఇదంతా రాజకీయ డ్రామాలో భాగమే. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో కడపలో స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపనతో మమ అన్పించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది ఏపీ సర్కారు. అనంతరం పురం జిల్లాలోని ఓబుళాపురం గనులు ఇప్పడు సీబీఐ కేసు వివాదంలో ఉన్నాయి. అవి తప్ప..రాష్ట్రంలో ఇంత భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమయ్యే ఖనిజం అందుబాటులో లేదు. అసలు ఓబుళాపురం గనుల్లోని ఖనిజంపై కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయి.

ఓ వైపు విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంటే ఇనుప ఖనిజం సరఫరాకు సంబంధించి పలు సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో ఖనిజ సరఫరా గ్యారంటీ లేకుండా ఏ ప్రైవేట్ సంస్థ అయినా వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి..ఎందుకు రిస్క్ లో పడుతుంది. అదే కేంద్రాన్ని ఒప్పించి ప్రాజెక్టు తెచ్చుకోగలిగితే ఖనిజ సరఫరా కూడా ఒప్పందం చేసుకునే వెసులుబాటు ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ వదిలేసి ఏపీ ప్రభుత్వం మంత్రివర్గంలో ఆమోదించినంత మాత్రాన కడప స్టీల్ ప్లాంట్ పరుగులు పెడుతుందనుకుంటే అది పొరపాటే. శంకుస్థాపనకు ముందే ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ అమలుకు ఏ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం చేసుకుంటుందో అన్నది కూడా ఈ ప్రాజెక్టు భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

Similar News