చంద్రబాబుపై పవన్ వైఖరిలో ఎందుకీ మార్పు?

Update: 2018-10-13 07:23 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిలో చిత్తశుద్ధి కన్పిస్తుందా? కొద్ది నెలల క్రితం కన్పించని చిత్తశుద్ధి ఇప్పుడు ఆకస్మాత్తుగా కన్పించటానికి కారణం ఏంటి?. నాలుగు సంవత్సరాల పాటు మోడీ సర్కారులో కొనసాగి బయటకు వచ్చిన తర్వాత ‘ప్రత్యేక హోదా’పై చంద్రబాబు సర్కారు అఖిలపక్షం నిర్వహించింది. దీన్ని వైసీపీతోపాటు..జనసేన, కాంగ్రెస్ తో సహా మెజారిటీ పార్టీలు బహిష్కరించాయి. దీనికి కారణం చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం తమను వాడుకుంటున్నారని ఆ పార్టీలన్నీ భావించటమే. ఇదే విషయాన్ని జనసేన కూడా ప్రకటించింది. కానీ ఇప్పుడు సడన్ గా పవన్ కళ్యాణ్ శనివారం నాడు విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘ప్రత్యేక హోదా’పై చంద్రబాబు అఖిలపక్షం పిలవాలని..దానికి తాము హాజరు అవుతామని ప్రకటించటం ఆసక్తికర పరిణామం. అంతే కాదు..వైసీపీని కూడా సమావేశానికి పిలవాలని పవన్ కళ్యాణ్ సిఫారసు కూడా చేశారు.

ఈ ఏడాది తొలి రోజుల్లో పెట్టిన సమావేశంలో కన్పించని చిత్తశుద్ధి ఇప్పుడు చంద్రబాబులో ఏమి కన్పించింది అనేదే పెద్ద ప్రశ్న. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మార్చినన్ని మాటలు బహుశా దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా మార్చి ఉండరు. అంతే కాదు..తాను చేస్తానని ప్రకటించిన అమరణ దీక్ష సంగతిని పూర్తిగా వదిలేసిన పవన్ ..చంద్రబాబు అఖిలపక్షం పెట్టాలి..అందరినీ ఢిల్లీకి తీసుకెళ్ళాలి మోడీతో మాట్లాడాలి అనే డిమాండ్లు పెట్టడం వెనక కారణం ఏంటి? అన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్రం ఇప్పటికే ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పింది. తాజాగా పవన్ కళ్యాణ్ పెట్టిన డిమాండ్లు చూస్తుంటే..ఆయన కూడా చంద్రబాబు లాగా మాటలు మార్చటంలో ‘రాజకీయం’గా అనుభవం సాధిస్తున్నట్లే కన్పిస్తోంది.

 

 

Similar News