ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసహనానికి గురవుతున్నారా?. అంటే అవుననే అన్పిస్తోంది ఆయన తాజా వ్యాఖ్యలు చూస్తుంటే. గురువారం నాడు కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూలేని రీతిలో ‘పీకుడు‘ భాష వాడారు. కర్నూలులో శంకుస్తాపనలు తప్ప... పరిశ్రమలేమీ రావటం లేదంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా? అని ఓ విలేకరి ప్రశ్నించగా..అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళేమి పీకారు...వాళ్లు ఏదో అన్నారని మీరు ఇక్కడ అడుగుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఓర్వకల్ వద్ద జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పారిశ్రామివేత్తలు, మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఈ ఘటన జరిగింది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనబడటం లేదా.. కేసుల మాఫీ కోసం భారతీయ జనతా పార్టీతో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ విమర్శలు గుప్పించారు.