‘పరకాల’ను పక్కన పెట్టుకుని బిజెపితో బాబు పోరాటమా!

Update: 2018-04-16 04:33 GMT

పరకాల ప్రభాకర్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మీడియా సలహాదారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరిన తర్వాత పదవి పొంది.. ఆ తర్వాత రెన్యువల్ పొందిన అతి తక్కువ మంది నేతల్లో పరకాల కూడా ఒకరు. పరకాల కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భర్త అన్న విషయం తెలిసిందే. ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను కేంద్రంలోని బిజెపితో...ప్రధాని నరేంద్రమోడీతో అలుపెరగని పోరాటం చేస్తున్నానని పదే పదే ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే పరకాలను పక్కన పెట్టుకుని చంద్రబాబు బిజెపితో పోరాటం చేస్తున్నానంటే ఎవరైనా నమ్ముతారా? అని టీడీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. అదీ అత్యంత కీలకమైన మీడియా సలహాదారు పదవిలో పెట్టుకుని. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక్క రోజు సింగపూర్ పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటనకు కూడా సీఎం పరకాలను వెంటపెట్టుకుని వెళ్ళటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదీ ఈ దశలో. నాలుగేళ్ళు ఎదురుచూసినా కేంద్రం ప్రత్యేక హోదాపై సరిగా స్పందించనందునే తాను పోరాట బాట ఎంచుకున్నానని చెబుతూ...అత్యంత కీలకమైన సమాచారానికి పరకాల వంటి వ్యక్తులను చేరువ ఉంచటం వెనక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది.

చంద్రబాబు ఓ పట్టాన ఎవరినీ అంత తొందరగా నమ్మరు. కానీ పరకాల విషయంలో ఏవో బలమైన శక్తులు ఉండబట్టే ఆయన్ను అత్యంత కీలకమైన పదవిలో కొనసాగిస్తున్నారని..పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసు సమయంలో కూడా పరకాల మీడియాతో చేసిన వ్యాఖ్యలు చంద్రబాబును తీవ్ర ఇరకాటంలో పడేశాయి. అప్పట్లోనే పార్టీ నేతలు పరకాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా సరే దావోస్ మొదలుకుని ..ప్రతి విదేశీ పర్యటనలోనూ ఆయనకు చోటు కల్పించారు. అంతే కాదు..చంద్రబాబునాయుడు బిజినెస్ రూల్స్ ను తుంగలో తొక్కి మరీ..మంత్రివర్గ సమావేశాల్లోనూ పరకాలను అనుమతించారు. దీనిపై అప్పట్లోనే ప్రభుత్వ ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూడా పరకాలను చంద్రబాబు సింగపూర్ పర్యటనకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందా? అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇవి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు.

 

Similar News