చంద్రబాబు బేలచూపులు...బెదురువ్యాఖ్యలు

Update: 2018-04-25 03:58 GMT

ఓ ముఖ్యమంత్రి తనను తాను రక్షించుకోలేరా?. అధికారంలో ఉన్న ఆయన్ను ప్రజలు రక్షించాలా?. అదేంటి? చంద్రబాబు బేలచూపులు..బెదురువ్యాఖ్యలు చూస్తుంటే మొత్తానికి ఏపీలో కీలక పరిణామాలకు రంగం సిద్ధం అవుతున్నట్లు కన్పిస్తోంది. చంద్రబాబునాయుడి వ్యాఖ్యలు చూసి ఆ పార్టీ క్యాడర్ కూడా గందరగోళంలో పడుతోంది. పార్టీ అధినేత వ్యాఖ్యాలు పార్టీని ఒకింత ఆత్మరక్షణలో పడేస్తున్నాయని తెలుగుదేశం వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఓ ముఖ్యమంత్రి ప్రజలకు రక్షణగా ఉండి..వాళ్ల అవసరాలు తీరుస్తారా?. లేక ప్రజలంతా అధికారపీఠంపై కూర్చున్న ముఖ్యమంత్రికి వలయంలా ఉండి కాపాడాలా?. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆపద వచ్చినా ప్రజలు చంద్రబాబును రక్షించాలట. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి రానీ ఆపద ఒక్క చంద్రబాబుకు మాత్రమే వస్తుందా?. ఆయనకే సమస్య ఎందుకొస్తుంది?. ప్రధాని నరేంద్రమోడీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎప్పటి నుంచో ఢీకొడుతోంది. పలు అంశాలపై ఆమె మోడీతోపాటు..బిజెపితో కూడా విభేదిస్తోంది.

చంద్రబాబు ప్రభుత్వం ఏ తప్పు చేయకపోయినా ఓ ముఖ్యమంత్రిపై కేంద్రం అంత అలవోకగా కేసులు పెట్టగలదా?. నిజంగా అలా జరిగితే అందరూ చూస్తూ ఊరుకుంటారా?. వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని చంద్రబాబు కోరటంలో ఎలాంటి తప్పు ఉండదు. కానీ తనకు ఏ సమస్య వచ్చినా ప్రజలు వలయంలా మారి తనను రక్షించాలని కోరటం అంటే చంద్రబాబులో బేలతనం ఎంత ఉందో అర్థం అవుతోందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూలేని రీతిలో చంద్రబాబు సర్కారు తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. అదే కారణంతో చంద్రబాబు ప్రస్తుతం కేంద్రం పేరెత్తితే వణికిపోతున్నారు. దీనికి తోడు కొత్తగా తాను హోదా కోసం పోరాడుతుంటే వేధింపులకు ప్రయత్నిస్తున్నారనే కలర్ ఇవ్వటం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. తాను నిప్పు...ఏ తప్పు చేయలేదని చెబుతున్న చంద్రబాబు ఎందుకు ప్రజల నుంచి రక్షణ కోరుతున్నారనేది ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

 

Similar News