ప్రధాని నరేంద్రమోడీ ఎందుకింత మొండిగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కోసం బిజెపి ప్రతిష్టను ఎందుకు ఫణంగా పెడుతున్నారు?. నిజంగా ప్రధాని మోడీ తలచుకుంటే లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ఒక్క నిమిషంలో చర్చకు రాదా?. కేవలం ఓ రెండు పార్టీలు నిరసన వ్యక్తం చేస్తే వారాలకు వారాలు సభను వాయిదా వేసేస్తారా?. పోడియంలో స్పీకర్ మొహనికి కూడా ప్లకార్డులు అడ్డం పెడుతుంటే ఎంపీలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎందుకు గట్టిగా వార్నింగ్ ఇవ్వటం లేదు?. అభ్యంతరకరంగా వ్యవహరిస్తే సభ నుంచి సస్పెండ్ చేస్తామని ఎందుకు హెచ్చరించటం లేదు? అలా వచ్చి ఇలా సభను రోజూ వాయిదా వేసుకుంటూ ‘అవిశ్వాస తీర్మానాన్ని’ ఎందుకు అడ్డుకుంటున్నారు?. ఎన్నో సంక్లిష్ట సమస్యలు ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంత దారుణంగా వ్యవహరించలేదే?. కనీసం స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆందోళన చేసే పార్టీల సభ్యులనో..లేక విపక్షాల నాయకులను పిలిచి ఎందుకు సమావేశం ఏర్పాటు చేయటంలేదు?. స్పీకర్ కాకపోతే ప్రభుత్వమే ఆ పని చేసి ఉండొచ్చు కదా?. కానీ అవేమీ ఎందుకు జరగటం లేదు?. బిజెపిలోని సొంత ఎంపీలకు మోడీపై కోపం ఉన్నా..ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టి..టీడీపీ, వైసీపీల మద్దతు ఇచ్చే పని చేస్తారా?.అలా చేయటం వల్ల వారికి వచ్చేది ఏముంటుంది?. అసంతృప్తితో ఉన్న కొద్ది మంది ఎంపీలను కూడా మేనేజ్ చేయలేని పరిస్థితిలో మోడీ, అమిత్ షాలు ఉన్నారని ఎవరూ అనుకోరు?.
మరి ఎందుకు తెలుగుదేశం, వైసీపీలు పెట్టే అవిశ్వాస తీర్మానం సభ ముందుకు రాకుండా అడ్డుకుంటున్నారు?. అయితే దీని వెనక చాలా బలమైన కారణాలు ఉన్నాయని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. నాలుగేళ్ళ పాటు కలిసుండి...ప్రత్యేక ప్యాకేజీకి స్వాగతించి చివరి నిమిషంలో రాజకీయంగా బిజెపిని టార్గెట్ చేయటంతో మోడీ అండ్ కో విపరీతమైన ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు ఏపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమ లావాదేవీలకు సంబంధించిన అంశాలు అన్నీ మోడీ దగ్గర ఉన్నాయని..అందుకే బిజెపి ప్రతిష్టను ఎంత మచ్చ వస్తున్నా..వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నా కూడా మోడీ ఈ విషయంలో వెనకంజ వేయటం లేదంటున్నారు. పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడినప్పటి నుంచే అసలు ఆట మొదలు అవుతుందని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. వేసవికి తోడు ఏపీ రాజకీయాలు రాబోయే రోజుల్లో మరింత సెగ పుట్టించటం ఖాయంగా కన్పిస్తోంది.