‘గవర్నర్’ నోట ప్రత్యేక హోదా మాట

Update: 2018-03-05 16:55 GMT

ఏపీ రాజకీయాలు అన్నీ ప్రస్తుతం ‘ప్రత్యేక హోదా’ చుట్టూనే తిరుగుతున్నాయి. సోమవారం నాడు ప్రారంభం అయిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోనూ అదే మాట విన్పించింది. కాకపోతే ఇది అధికార పార్టీ నుంచో..ప్రతిపక్షం నుంచో కాకుండా..గవర్నర్ నరసింహన్ నోట నుంచి ‘ప్రత్యేక హోదా’ డిమాండ్ వినపడింది. విభజనతో నష్టపోయిన ఏపీ గాడిన పడాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవం సందర్బంగా గవర్నర్ నరసింహన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అంతే కాకుండా అసెంబ్లీ సీట్ల పెంపుతో పాటు పలు అంశాలను కూడా నరసింహన్ ప్రస్తావించారు. అదే సమయంలో ఏపీ మిగతా రాష్ట్రాలకంటే వేగంగా దూసుకుపోతున్నదని గవర్నర్‌ నరసింహన్‌ చెప్పారు. 11.3 శాతం వృద్ధిరేటుతో రాష్ట్రం ప్రగతి సాధిస్తోందని, అది జాతీయ సగటు 6.97 కంటే చాలా ఎక్కువని తెలిపారు.

రైల్వేజోన్‌తోపాటు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను నిరవేర్చాల్సిఉందని, 9,10వ షెడ్యూళ్లలోని ఆస్తుల పంపిణీ కూడా పూర్తిచేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొరత లేకుండా చేయగలిగామని, వ్యవసాయం, పారిశ్రామిక, విద్య, వైద్య, ఉపాధి, ఐటీ రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని నమోదు చేశామని, అనంతపురంలో కరువును పారద్రోలామని, పరిశ్రమల స్థాపనతో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి బాటలు వేశామని, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ తో ప్రజలకు మరింత చేరువయ్యామని బడ్జెట్‌ ప్రసంగంలో గవర్నర్‌ పేర్కొన్నారు.

Similar News