సోషల్ మీడియాకు చంద్రబాబు ఓ పెద్ద న్యూస్ ‘సోర్స్’

Update: 2018-03-31 13:31 GMT

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సామాజిక మాధ్యమాల్లో వార్తలకు ఓ పెద్ద ‘సోర్స్’గా మారిపోయారు. ఆయన చేసే విచిత్ర వ్యాఖ్యలు...కామెంట్లను మెయిన్ లైన్ మీడియా సహజంగానే పాతరేస్తుంది. ఇక మిగిలింది సోషల్ మీడియానే కాబట్టి..చంద్రబాబు వారికి కావాల్సినంత ‘మేత’ ఇస్తున్నారు. తాజాగా ఆయన ఒంటిమిట్టలో చేసిన వ్యాఖ్యలు పెద్ద కామెడీనే తలపిస్తున్నాయి. అవేంటో మీరూ ఓ సారి చూడండి. ‘విభజన తర్వాత మనకు ఎంతో చరిత్ర ఉన్న ఒంటిమిట్ట దేవాలయంలో పలు కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ టెంపుల్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం. బమ్మెర పోతన ఇక్కడే రామాయణం రాసి.. ఈ దేవుడికి అంకితం చేసిన విషయం కూడా మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.’. నిజానికి బమ్మెర పోతనకు రామాయణానికి ఎలాంటి సంబంధం లేదు. బమ్మెర పోతన చేసింది భాగవతాన్ని తేటతెలుగులోకి అనువదించారు. కానీ చంద్రబాబు మాత్రం ఏకంగా బమ్మెర పోతన రామాయణం రాసేశాడని చెప్పటంతో సోషల్ మీడియాలో ఆయనపై సెటైర్లు పేలుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వేసిన అన్ని పిల్లిమొగ్గలు బహుశా ఏ రాజకీయ నాయకుడు కూడా వేసి ఉండరు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలోనూ ఆయన చెప్పిన డైలాగులు అన్నీ ఇన్నీ కావు.

ఇప్పుడు అమరావతి కట్టడానికి ప్రజలే అప్పు ఇవ్వాలని వ్యాఖ్యానించటంతో అవాక్కు అవటం ప్రజల వంతు అవుతోంది. దీనికి సంబంధించి కూడా ఫోటోలు పెట్టి మరీ చంద్రబాబు హామీలను వాట్సప్ గ్రూపుల్లో భారీ ఎత్తున షేర్ చేస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు రైతుల అప్పుల అన్నీ తీరుస్తానని..ప్రపంచ స్థాయి రాజధాని కడతానని హామీల మీద హామీలు గుప్పించారు. రైతు రుణ మాఫీ కూడా పలు ఆంక్షలు పెట్టి ఏదో మమ అన్పించేశారు. ఇక్కడ కూడా చెప్పింది ఒకటి...చేసింది మరొకటి. ఇప్పుడు ప్రజలు అప్పులు ఇస్తే ప్రపంచం దలదన్నే రాజధాని కడతా అని చంద్రబాబు చెబుతున్నట్లు ఫోటోలు తయారు చేసి వాట్సప్...ఫేస్ బుక్ ల్లో షేర్ చేసేస్తున్నారు. నిజంగా కూడా ఇవి ప్రజలకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. తొలుత మై బ్రిక్స్..మై అమరావతి అంటూ ఓ కార్యక్రమం చేపట్టిన చంద్రబాబు..ఇప్పుడు కొత్తగా బాండ్లు అంటూ కొత్త రాగం అందుకున్న విషయం తెలిసిందే. పై ఫోటో వాట్సప్ గ్రూపుల్లో భారీ ఎత్తున షేర్ అవుతోంది. ఈ ఒక్క ఫోటోనే వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు అన్ని విషయాలు చెప్పేసింది.

 

Similar News