తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా కలకలం. వచ్చే నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఓ అనూహ్య పేరు తెరపైకి రావటంతో ఆ పార్టీ వర్గాల్లో ఒక్కసారిగా వేడి అందుకుంది. మార్చి మొదటి వారంలోనే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రానుండటంతో అత్యంత కీలకమైన రాజ్యసభ స్థానం దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. తాజాగా ‘రిలయన్స్ మాధవ్’ టీడీపీ కోటా నుంచి రాజ్యసభ బరిలో నిలవనున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో గుప్పుమంటోంది. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అమరావతిలో పర్యటించి..ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఆధిథ్యం కూడా తీసుకుని వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన కూడా మాధవ్ పేరు సిఫారసు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.
ఎవరూ ఊహించని రీతిలో రాజ్యసభ రేసుకు సంబంధించి రిలయన్స్ మాధవ్ పేరు తెరపైకి రావటంతో సీటు ఆశిస్తున్న నాయకులు నానా టెన్షన్ పడుతున్నారు. ఇది ఎవరి అవకాశాలను దెబ్బతీస్తుందా? అన్న టెన్షన్ లో నేతలు ఉన్నారు. ఏపీ కోటా నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో రెండు సీట్లు టీడీపీకి పక్కా. అసెంబ్లీ బలాబలాల ప్రకారం చూసుకుంటే ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి ఒక సీటు గ్యారంటీ. అయితే అధికార టీడీపీ మూడవ సీటుకు కూడా అభ్యర్థిని బరిలో నింపే ప్రయత్నాల్లో ఉంది. సీట్లు రెండే ఉండటం..ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో చంద్రబాబుకు ఇది కత్తిమీదసాములా మారనుంది. ఈ తరుణంలో రిలయన్స్ మాధవ్ పేరు టీడీపీ నేతల నుంచే ప్రచారంలోకి రావటంతో సీటు ఆశిస్తున్న వారు టెన్షన్ పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఏపీలో రిలయన్స్ వ్యవహారాలు అన్నీ ఈ మాధవే చూసుకునే వారు. ప్రస్తుతం కూడా తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.
2018 ఏప్రిల్ లో ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న చిరంజీవి, రేణుకా చౌదరి, దేవేందర్ గౌడ్ పదవి విరమణ చేయనున్నారు. సీఎం రమేష్ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆయన రాజ్యసభ కాలపరిమితి కూడా ఏప్రిల్ లోనే ముగియనుంది. ఆయన తనకు మళ్ళీ రెన్యువల్ చేయించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. జూపూడి ప్రభాకర్ తోపాటు వర్ల రామయ్య తదితరులు రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు కూడా అదే పనిలో ఉన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఎలాగైనా సీనియర్ మంత్రి యనమలను రాజ్యసభకు పంపాలని యోచిస్తుండగా..చంద్రబాబు దీనికి అడ్డుపడుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతిమంగా ఎవరికి సీటు దక్కుతుందో తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున బరిలో నిలిచే ఛాన్స్ లేనివారికే ఈ సీట్లు కేటాయించవచ్చని చెబుతున్నారు.