ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. దావోస్ సమావేశం ముందు ఆయనకు భారత దేశ గణతంత్ర దినోత్సవం కన్పించలేదు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన దావోస్ సమావేశానికి హాజరు కావటంపై ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం వంటి రాజ్యాంగపరమైన కార్యక్రమాలు ఉన్న సమయంలో ఎప్పుడైనా ఒక రోజు ముందో..కనీసం ఒక పూట ముందుగానే నగరానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. అధికారులు కూడా అలాగే చెప్పితీరాలి. కానీ శుక్రవారం ఏడు గంటలకు రావాల్సి ఉన్న విమానం ..పొగమంచు కారణంగా జాప్యం అయింది. రాలేకపోయారు అనటానికి ఇదేమీ ఎవరి ఇంట్లో పెళ్ళి కాదు. దేశానికి..రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. అంత తేలిగ్గా తీసిపారేయటానికి ఇదేదో వ్యక్తిగత వ్యవహారం కాదు. చంద్రబాబునాయుడు గవర్నర్ జెండా వందనం చేసే సమయంలో లేకపోవటం ఒకెత్తు అయితే...ఆయన సతీమణి, నారా భువనేశ్వరి ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో జెండా ఆవిష్కరణ కూడా నిబంధనల ఉల్లంఘనే అని అధికార వర్గాలు చెబుతున్నాయి.
అది ముఖ్యమంత్రి అధికారిక నివాసం అయినందున ఆయనే జెండా ఆవిష్కరించాలి కానీ..కుటుంబ సభ్యులు కాదని అధికారులు చెబుతున్నారు. బయట ఎక్కడైనా..ఎవరైనా జెండా ఆవిష్కరణ చేయవచ్చు. కానీ సీఎం అధికారిక నివాసంలో మాత్రం కుటుంబ సభ్యులు ఇష్టానుసారం చేయటానికి ఉండని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఏదైనా ముఖ్యమంత్రి ఇలాంటి కీలక కార్యక్రమాల్లో పాల్గొనలేని పరిస్థితి ఉంటే..ప్రత్యేకంగా జీవో ఇచ్చి ఎవరు అధికారిక నివాసంలో జెండా ఆవిష్కరిస్తారు..ప్రభుత్వం తరపున గవర్నర్ ప్రసంగ కార్యక్రమంలో ఎవరు పాల్గొంటారో చెప్పాల్సి ఉంటుందని..అలా ఏమీ లేకుండా ఇలా చేయటం ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.