ఎందుకంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కొన్ని స్కూళ్లలో విద్యార్ధులకు సరైన టాయిలెట్లు కూడా లేవు. ఈ విషయాన్ని కొద్ది కాలం క్రితం మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అసెంబ్లీ వేదికగా అంగీకరించారు కూడా. నిత్యం విజన్ గురించి మాట్లాడే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంతకు ముందు తొమ్మిదన్నర సంవత్సరాలు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉండి కూడా కనీసం తన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా అన్ని స్కూళ్లలో సరైన మౌలికసదుపాయాలు కల్పించుకోలేకపోయారు. ఇదొక్కటే కాదు..జిల్లాలో మౌలికసదుపాయాలు అంతంత మాత్రమే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఎక్కడ దాకానో ఎందుకు దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ వేత్తగా క్లెయిం చేసుకునే చంద్రబాబు తన స్వగ్రామం నారావారిపల్లెను కూడా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దలేకపోయారు. విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ గ్రామాన్ని చంద్రబాబు కోడలు..మంత్రి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
జన్మభూమిలో భాగంగా ఇప్పుడు రాష్ట్రంలోని కలెక్టర్లు అందరూ ప్రతి గ్రామంలో కుటుంబానికి మరుగుదొడ్డి ఉండేలా చూడాలని ఆదేశించారు. దీని కోసం అవసరం అయితే ఒక రోజు అంతా కలెక్టర్లపై పోరాటానికి ఒక రోజు నిరాహారదీక్ష చేస్తారంట. ఇది చంద్రబాబు గురువారం నాడు శ్రీకాకుళం జిల్లాలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్న ఆదేశాలు కలెక్టర్లు పాటించటంలేదా?. లేక సీఎం కు నిరాహారదీక్ష చేయాలన్న కోరిక ఉందో అర్థం కావటంలేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు.చంద్రబాబు జన్మభూమిలో చేసిన నిరాహారదీక్ష వ్యాఖ్యలు అధికార వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.