అక్రమాలకు అడ్డొస్తే ఎవరైనా సహించేది లేదు అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. మీరు ఫైళ్లలో రాసుకునేది రాసుకోండి..మేం చేసుకునేది చేసుకుంటాం అన్న చందంగా ‘ముందుకెళుతున్నారు’. అసలు కేబినెట్ ఉన్నదే అక్రమాలను సక్రమం చేయటానికి అన్న చందంగా అన్నీ కేబినెట్ ముందు పెట్టేసి మరీ మంత్రులందరినీ కూడా ఇరికించేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనే..లేకపోతే తర్వాతో ప్రభుత్వం మారితే మాత్రం కేబినెట్ ఆమోదించిన అంశాలు చాలు చాలా మందిని జైలుకు పంపించటానికి అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. తాజాగా చోటుచేసుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెండర్ల రద్దు ఈ కోవలోకే వస్తుంది. ఈ టెండర్ల విషయంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కార్పొరేషన్ (బిఐఏసీఎల్) బోర్డుతో పాటు....కార్యదర్శుల కమిటీ కూడా ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కే ప్రాజెక్టు అప్పగించాలని సిఫారసు చేశాయి. అసలు భోగాపురం విమానాశ్రయంలో ఎంఆర్ వో సౌకర్యం , ఏరో సిటీ వంటివి ఇప్పటికిప్పుడు ఏమాత్రం అవసరంలేని కాంపోనెంట్స్ అని అధికార వర్గాలు తెలిపాయి.
పోటీ బిడ్డింగ్ లో ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టును దక్కించుకున్న ఏఏఐ రెవెన్యూలో ఏపీ సర్కారుకు 30.20 శాతం వాటాతోపాటు 26 శాతం ఈక్విటీ కూడా ఇవ్వటానికి ముందుకొచ్చింది. దీంతో పాటు విమానాశ్రయం కోసం ఇఛ్చే భూమికి సంబంధించి ఏటా అద్దె కింద ఎకరాకు 20 వేల రూపాయలు ఇవ్వటానికి అంగీకరించింది. ఈ ప్రతిపాదనలను అధికారులు కేబినెట్ ముందు పెట్టగా..వీటి అన్నింటిని పక్కన పెట్టేసి టెండర్ రద్దుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ తనకు నచ్చినట్లు, ప్రభుత్వానికి కమిషన్లు ఇఛ్చేవారు కాదని ఏ టెండర్ ను అయినా రద్దు చేయవచ్చా?. మరి అలాంటప్పుడు బిఐఏసీఎల్ బోర్డు ఎందుకు...అధికారుల కమిటీ ఎందుకు?. చంద్రబాబునాయుడు, మంత్రులే ఎవరికి నచ్చినట్లు వారికి ప్రాజెక్టులు ఇచ్చుకోవచ్చు కదా?. అధికారులు చెప్పేది ఇది నిబంధనల ప్రకారం ఉందా?. లేదా అన్నది మాత్రమే. సొంత అధికారులు చెప్పిన మాటలను కూడా పట్టించుకోని కేబినెట్ సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇక ప్రభుత్వానికి పవిత్రత ఏముంటుంది?. సాగునీటి ప్రాజెక్టుల దోపిడీలోనూ ఇదే మోడల్ ఫాలో అయ్యారు.