ఏపీకి చెందిన దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు వివాదంలో చిక్కుకున్నారు. లైంగిక వేధింపుల కేసులో పక్కా ఆధారాలతో అరెస్టు అయిన గజల్ శ్రీనివాస్ ను వెనకేసుకొచ్చిన మంత్రి తర్వాత నాలుక మడతేశారు. తొలుత గజల్ శ్రీనివాస్ పై కావాలని కుట్ర ప్రకారమే ఇలా చేశారని భావిస్తున్నట్లు చెప్పారు. విజయవాడలో బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. పథకం ప్రకారం రికార్డ్ చేయకపోతే శ్రీనివాస్‌పై అలాంటి వీడియోలు బయటకు ఎలా వస్తాయన్నారు. గజల్ శ్రీనివాస్ దేశ వ్యాప్తంగా తిరిగి అద్బుతమైన గజల్స్ వినిపించిన వ్యక్తి అని, తనకు చిన్నప్పటి నుంచి శ్రీనివాస్ తెలుసునన్నారు.
లైంగిక వేధింపుల వీడియోలతో అడ్డంగా దొరికిన నిందితుడికి గౌరవప్రద మంత్రి హోదాలో ఉన్న మాణిక్యాలరావు వత్తాసు పలకడం హాట్ టాపిక్‌గా మారింది. తర్వాత తప్పు తెలుసుకున్న మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వీడియోలు చూడక ముందు తాను ఈ ప్రకటన చేశానని.. వీడియోలు తనకు వేరే వాళ్ళు పంపితే చూశానని..తర్వాత తన ప్రకటన ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. అయితే అప్పటికే మంత్రికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.