తెలుగు పత్రికా రంగంలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన పత్రిక ‘ఉదయం’. అలాంటి పత్రిక మళ్ళీ ప్రజల్లోకి రాబోతోంది. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది ఉగాదికే ఈ ఉదయం పత్రిక పాఠకులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పత్రికను తెలుగు న్యూస్ ఛానల్ నడుపుతున్న టీవీ5 యాజమాన్యమే తీసుకురానున్నట్లు సమాచారం. ఈ సంస్థ యాజమాన్యం ఇఫ్పటికే ‘ఉదయం’ టైటిల్ ను దక్కించుకోవటంతో పాటు...పత్రిక ప్రారంభోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ప్రారంభించింది. ఛానల్ కు తోడు పత్రిక కూడా ఉంటే మరింత శక్తివంతంగా ఉంటుందనే ఉద్దేశంతో యాజమాన్యం ఉదయం పత్రికను తీసుకున్నట్లు చెబుతున్నారు.
దీనికి తోడు వచ్చే ఏడాది కాలంలోనే ఎన్నికలు ఉండటం కూడా కలసి వస్తుందని అంచనా వేస్తున్నారు. కొత్తగా పత్రిక ప్రారంభించే యాజమాన్యానికి ఉదయం టైటిల్ ఓ బలంగా మారనుంది. ఛానల్ నిర్వహణకు..పత్రిక నిర్వహణకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అయినా పేరున్న టైటిల్ కావటంతో ఈజీగా ప్రజల్లోకి వెళ్లగలదని భావిస్తున్నారు. ఇప్పటికే గతంలో ఇంగ్లీషులో వెలువడి, ఆగిపోయిన ‘మెట్రో ఇండియా’ పత్రిక తెలుగులో రానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నాయి. దీనికితోడు మంచి బ్రాండ్ కలిగిన ఉదయం పత్రిక కూడా రానుండటంతో తెలుగు మీడియాలో కొంత కాలం హల్ చల్ నడిచే అవకాశం కన్పిస్తోంది.