తెలుగు రాష్ట్రాల్లో ప్రకాష్ రాజ్ కు స్వేచ్ఛ లేదా?

Update: 2017-12-11 07:09 GMT

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పలు భాషల్లో ప్రకాష్ రాజ్ నటించినా ఎక్కువ శాతం మాత్రం ఆయన చేసింది తెలుగు సినిమాలే. కానీ ఆయన తాజాగా కేరళలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళ రాష్ట్రాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. దీనిపై ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ తాను నిర్భయంగా శ్వాస తీసుకోగలిగే రాష్ట్రం ఏదైనా ఉంటే అది కేరళనే అని ఆయన పేర్కొన్నారు. ఇదే అభ్యంతరకరం. ఆయన నటనను ఆస్వాదించి..ఆదరించిన తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు స్వేఛ్చ లేదా?. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది. కేరళ అంతర్జాతీయ చిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌కే) ప్రారంభోత్సవంలో ప్రకాశ్‌ రాజ్‌ మాట్లాడారు. అదేంటో మీరూ చూడండి. 'నేను కేరళకు వచ్చినప్పుడు స్కిప్ట్‌ తీసుకొని రాను. ఎందుకంటే సెన్సార్‌ భయం ఉండదు. నాకు కేరళ అంటే చాలా ఇష్టం.

నేను నిర్భయంగా శ్వాస తీసుకోగలిగే రాష్ట్రం కేరళనే' అని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు సనాల కుమార్‌ శశిధరన్‌ తెరకెక్కించిన 'సెక్సీ దుర్గ' సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారిపై ప్రకాశ్‌ రాజ్‌ మండిపడ్డారు. 'ఎస్‌ దుర్గ సినిమాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వ్యక్తులకు 'దుర్గ వైన్‌షాప్‌, దుర్గ బార్‌' వంటి పేర్లతో ఎలాంటి అభ్యంతరం లేనట్టు ఉంది. నన్ను బెదిరించే వారిని చూసి నవ్వుతాను. నా నోరు మూయించాలనుకునేవారిని చూసి గట్టిగా పాడుతాను. నా హక్కులను వారు దూరం చేయలేరు' అని చెప్పారు. తనకు ఎలాంటి రాజకీయ సంస్థలతో సంబంధం లేదని, సమాజంలో జరుగుతున్న పరిణామాలపై గొంతెత్తడం ఒక కళాకారుడిగా తన బాధ్యత అని వ్యాఖ్యానించారు.

 

 

Similar News