తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో శ్వేతపత్రం ప్రకటించటంతోపాటు..కేంద్రం అడిగిన లెక్కలు చెప్పకపోతే ప్రజల్లో అనుమానాలు మరింత బలపడే అవకాశం ఉందని పవన్ తన తాజా పర్యటనలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కు పోలవరం గురించి ఏమీ తెలియదని..జగన్ కు చెప్పినా అర్థం కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సోమవారం పోలవరం లో ఏరియల్ సర్వే నిర్వహించంతోపాటు..అక్కడ జరుగుతున్న పనులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాలనే చూస్తే ఈ విషయంలో ఎంత వరకూ అయినా వెళ్లటానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. తాము ముందు చెప్పినట్లుగానే 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరు అందిస్తామని చంద్రబాబు తెలిపారు.
ఎవరైనా ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలు తెలుసుకోవటంలో తప్పులేదన్నారు. అందరికీ అన్నీ విషయాలు తెలియాలని ఏమీ లేదన్నారు. తాను వారం వారం వస్తుంటేనే కొన్ని సాంకేతిక అంశాలు అర్ధం కావటంలేదన్నారు. అటువంటిది ఏమీ తెలీకపోయినా అన్నీ తెలిసినట్లు మాట్లాడుతున్నవారితోనే సమస్యలు వస్తున్నాయంటూ మండిపడ్డారు. డయాఫ్రం వాల్ అంటే ఏమిటో కూడా తెలీని వాళ్ళు ప్రాజెక్టు గురించి మాట్లాడ్డమేంటని చంద్రబాబు మండిపడ్డారు.ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న పవన్ డిమాండ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతీ వారం ప్రాజెక్టుకు సంబంధించి వివరాలు ప్రకటిస్తున్నపుడు ప్రత్యేకించి శ్వేతపత్రం అవసరం లేదని తేల్చేసారు. ప్రాజెక్టు వివరాలు పారదర్శకంగా అందిస్తున్నట్లు కూడా చెప్పారు.