మంజునాథ నివేదికకు సర్కారు అడ్డంకులు..సెలవులో సభ్య కార్యదర్శి

Update: 2017-12-09 13:01 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు ఎదురుతిరిగితే ఎవరితో అయినా ఎలా వ్యవహరిస్తారో బహిర్గతం చేసే అంశం ఇది. సాక్ష్యాత్తూ రిటైర్డ్ జడ్జి విషయంలోనే ఇలా జరిగింది అంటే...ఇక మిగిలిన వారి విషయంలో ఎలా ఉంటుందో ఊహించుకోవటం పెద్ద కష్టం కాబోదు. బీసీ కమిషన్ ఛైర్మన్ మంజునాథతో సంబంధం లేకుండా కేవలం బీసీ కమిషన్ సభ్యులతో నివేదిక తెప్పించుకుని..కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా ఏపీ సర్కారు కేబినెట్ తీర్మానం చేయటం..ఆ తర్వాత ఏకంగా అసెంబ్లీ, మండలిలో బిల్లు ఆమోదింపచేసుకోవటం తెలిసిందే. అసలు ఛైర్మన్ తో సంబంధం లేకుండా కమిషన్ సభ్యులు ఇఛ్చిన నివేదికే చెల్లుబాటు కాదనే వాదనా ఉంది. ఈ వాదనను కాసేపు పక్కన పెడితే చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం సర్కారులో కలకలం రేపుతోంది. బీ సి కమిషన్ సభ్యులు నివేదిక ఇచ్చిన తర్వాత జస్టిస్ మంజునాథ కమిటీ సభ్యులతో సమావేశం అయ్యారని..కమిషన్ అంటే ఉమ్మడిగా నివేదిక ఇవ్వాలి కానీ..ఇలా విడివిడిగా నివేదిక ఇస్తే అది చెల్లుబాటు కాదని చెప్పినట్లు సమాచారం. అంతే కాదు..కమిషన్ ఛైర్మన్ గా ఉన్న తాను కూడా సొంతంగా నివేదిక ఇవ్వటం సాధ్యంకాదని...సభ్యులు ఎవరైనా నివేదికపై విభేదిస్తే ఆ అంశాలను కూడా అందులో పొందుపర్చే ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అంతే కాదు..బీసీ కమిషన్ ఛైర్మన్ మంజునాథ సభ్యులు ఇఛ్చిన నివేదిక తర్వాత తాను ప్రభుత్వానికి తన నివేదిక సమర్పిస్తానని మీడియాకు వెల్లడించారు. సభ్యులు ఇచ్చిన నివేదిక విషయం తనకు తెలియదని బహిరంగంగానే ప్రకటించారు. అంతే సర్కారు వెంటనే రంగంలోకి దిగింది. బీసి కమిషన్ ఛైర్మన్ తాను రెండు మూడు రోజుల్లోనే నివేదిక ఇస్తానని ప్రకటించారు. అంతే సర్కారు వెంటనే ఆ నివేదిక తమ దగ్గరకు చేరకుండా బీసీ కమిషన్ సభ్య కార్యదర్శి ఎ.కృష్ణమోహన్ ను సెలవులో పంపింది. అనారోగ్య కారణాలతో కృష్ణమోహన్ సెలవు పెట్టినట్లు చెబుతున్నా..ఆయన గత సోమవారం నుంచి ఆఫీసుకు హాజరు కావటం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీని వెనక ప్రధాన కారణం మంజునాథ నివేదిక సర్కారుకు చేరకుండా చూడటమే. బీసీ కమిషన్ సభ్యులు ఇచ్చిన నివేదిక తర్వాత ఛైర్మన్ నివేదిక అంది..అది కాపుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంటే అది రాజకీయంగా రగడ సృష్టించే అవకాశం ఉందనే భావించే సర్కారు కృష్ణమోహన్ ను సెలవులో పంపిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కమిషన్ నివేదిక సర్కారు కు చేరాలంటే సభ్య కార్యదర్శి కృష్ణమోహన్ అందుబాటులో ఉండటం తప్పనిసరి. అందుకు సర్కారు ఈ ఎత్తుగడ వేసినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. మరి ఎన్ని రోజులు కృష్ణమోహన్ సెలవులో ఉంటారు?. మంజునాథ నివేదిక ఏమి ఇస్తారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

 

 

Similar News