ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా మారిన అమరావతికి విమాన కనెక్టివిటి క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నెల 19 నుంచి గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబయ్ కు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. త్వరలోనే గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు.
బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... గన్నవరం విమానాశ్రయం విస్తరణ పూర్తయ్యాక అంతర్జాతీయ విమానాలను ప్రారంభిస్తామన్నారు. అలాగే పౌర విమాన రంగంలో మన దేశం ప్రపంచంలో 14వ స్థానంలో ఉందని మంత్రి చెప్పారు. నీటిలో, గాలిలో ప్రయాణించగలిగిన సీ ప్లేన్‌ను ప్రారంభిస్తున్నామన్నారు.అమరావతిలో కూడా సీప్లేన్ ప్రదర్శన చేయాలని స్పైస్ జెట్ సీఎండీని కోరానన్నారు.