‘పోలవరం’పై ఇక కేంద్రం నిరంతర నిఘా!

Update: 2017-12-14 04:34 GMT

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ‘బ్లేమ్ గేమ్’కు కేంద్రం చెక్ పెట్టాలని నిర్ణయించిందా?. అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. అందులో భాగంగానే కేంద్ర మంత్రి గడ్కరీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెబుతున్నారు. సోమవారం పేరు పోలవారంగా మార్చామనే ఏపీ సీఎం చంద్రబాబు తరహా హంగామా వంటివి ఏమీలేకుండానే క్షేత్రస్థాయిలో అసలు ఏమి జరుగుతున్నదనే సమాచారం నిరంతరం ఇచ్చేందుకు రాజమండ్రి కేంద్రంగా ఓ అధికారిని పెట్టాలని గడ్కరీ నిర్ణయించారు. అంతే కాదు..స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీనే ఈ ప్రాజెక్టు ప్రగతిని పరిశీలించనున్నారు. ఏడు లక్షల కోట్ల రూపాయల పనులను టార్గెట్ ప్రకారం పూర్తి చేయించే తనకు..ఇది ఓ పెద్ద లెక్కకాదు అన్న చందంగా గడ్కరీకి చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు పంపారు. ఏ సమస్య ఉన్నా నీటిపారుదల శాఖ కార్యదర్శి తన దగ్గరకు రావొచ్చని బ్లాంకెట్ అనుమతి ఇఛ్చేశారు. అదే సమయంలో చంద్రబాబు సర్కారు కొత్తగా పిలిచిన 1400 కోట్ల రూపాయల టెండర్ కు తాత్కాలికంగా గడ్కరీ బ్రేక్ వేశారు. ఇది ఖచ్చితంగా చంద్రబాబునాయుడికి ఎదురుదెబ్బే. అసలు పీపీఏ అనుమతి లేకుండా ఇలా టెండర్లు పిలవటమే తప్పు.

ట్రాన్స్ స్ట్రాయ్ ను ప్రాజెక్టు నుంచి తప్పించటానికి కేంద్రం మొదటి నుంచి సుముఖంగా లేదు. దీనికి ప్రధాన కారణం కొత్తగా టెండర్లు పిలిస్తే నిర్మాణ వ్యయం మరింత పెరుగుతుందనే. అయితే ట్రాన్స్ స్ట్రాయ్ తాము లెస్ కు టెండర్ వేసినందున పెరిగిన రేట్ల ప్రకారం ధరలు చెల్లిస్తే పనులు చేయటానికి తాము కూడా రెడీ అని చెబుతోంది. అయితే చంద్రబాబు అంతిమ లక్ష్యం వేరు కాబట్టి ఈ ప్రతిపాదనను పరిశీలించటం లేదు. అయితే ఏపీలో చంద్రబాబు పోలవరం పేరుతో బిజెపికి చేస్తున్న డ్యామేజిని గుర్తించిన కేంద్ర సర్కారు గడ్కరీ నిరంతర పర్యవేక్షణతోనే పోలవరం పూర్తి చేసి...ఆ క్రెడిట్ లో సింహ భాగం వాటాను తాము కొట్టేయటమే కాకుండా...చివర్లో చంద్రబాబు చేసిన లొసుగుల వ్యవహారాలను కూడా బహిర్గతం చేయాలనే యోచనలో ఉన్నట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి. మరి కేంద్రంగా నేరుగా రంగంలోకి దిగటంతో పోలవరం 2019 నాటికి పూర్తవుతుందా?.లేదో వేచిచూడాల్సిందే. ఏది ఏమైనా పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే మాత్రం అది ఏపీ ప్రజలకు మాత్రం ఓ వరంగా మిగలటం ఖాయం.

 

 

 

Similar News