ఆంధ్రప్రదేశ్ కు గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం లేదు. ఏపీలోని పలు విమానాశ్రయాలకు కేంద్రం అంతర్జాతీయ హోదా ఇఛ్చినా ఒకేసారి కనీసం మూడు..నాలుగు విమానాలు దిగే పరిస్థితి ఎక్కడా ఉండదు. రన్ వే ల దగ్గర నుంచి పార్కింగ్ వరకూ అన్నీ సమస్యలే. అందుకే ఏపీ సర్కారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కు శ్రీకారం చుట్టింది. దీని కోసం అవసరమైన భూ సేకరణ కూడా పూర్తి చేసింది. టెండర్లు పిలిచారు. కానీ ప్రభుత్వం కోరుకున్నట్లు అగ్రశ్రేణి ప్రైవేట్ సంస్థకు కాకుండా..ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) ఈ విమానాశ్రయ నిర్మాణ, నిర్వహణ బాధ్యతను పోటీ బిడ్డింగ్ ద్వారా దక్కించుకుంది. ఇది జరిగి మూడు నెలలు దాటినా ...ఏపీ సర్కారు మాత్రం ఆ ప్రాజెక్టును ఇంకా ఎఎఐకి అప్పగించటం లేదు. ఇది ప్రభుత్వ వర్గాల్లోనే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పెద్దలు కోరుకున్నట్లు ప్రైవేట్ సంస్థకు కాకుండా...ప్రభుత్వ రంగ సంస్థకు ఈ ప్రాజెక్టు దక్కటం వల్ల తమకు ఏమీ ‘ఉపయోగం’ ఉండదని భావించి ఎలా దీన్ని తప్పించాలా? అనే ప్లాన్ చేస్తున్నారని కూడా మౌలికసదుపాయాల శాఖ వర్గాలు అనుమానిస్తున్నాయి.
పైకి మాత్రం తమ లాభం గురించి ప్రస్తావించకుండా..ఎఎఐ అయితే ప్రైవేట్ సంస్థల తరహాలో అంతర్జాతీయ లుక్ ఇవ్వలేదని..అందుకే ప్రభుత్వ పెద్దలు దానికి ప్రాజెక్టు అప్పగించటానికి ముందుకు రావటంలేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. సాక్ష్యాత్తూ ఎఎఐ ఏపీకి చెందిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు శాఖలోనిదే కావటం విశేషం. పోటీ బిడ్డింగ్ లో అధికారికంగా ఎఎఐకి వచ్చిందనే విషయం తేలిన తర్వాత మూడు మంత్రివర్గ సమావేశాలు జరిగినా కూడా సర్కారు కేబినెట్ ముందు ఈ అంశాం పెట్టకుండా కావాలనే జాప్యం చేస్తోందనే విమర్శలు సర్కారు ఎదుర్కొంటోంది. ఏపీకి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అవసరం ఎంతో ఉందని ప్రభుత్వం గతంలో పలుమార్లు ప్రకటించింది. భోగాపురం ఎయిర్ పోర్టు రేసులో రేసులో జీఎంఆర్, ఎఎఐ మాత్రమే నిలిచాయి. 2260 కోట్లతో ఈ ప్రాజెక్టు ప్రతిపాదించారు.
అతి పెద్ద విమానం అయిన డబుల్ డెక్కర్ అంటే ఎ 380 కూడా ల్యాండ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు తొలి దశలోనే. ఈ బిడ్ లో ఎఎఐ ప్రభుత్వానికి 30.2 శాతం ఆదాయంలో వాటా ఇవ్వటానికి ముందుకు వచ్చి ఎల్ 1గా నిలిచింది. అదే జీఎంఆర్ సంస్థ 21.6 శాతం మాత్రమే రెవెన్యూ వాటా ఇవ్వటానికి బిడ్ దాఖలు చేసింది. ఇప్పటికే ప్రతిపాదిత ఎయిర్ పోర్టుకు పర్యావరణ అనుమతి కూడా లభించింది. పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కంపెనీ లిమిటెడ్ అనే ఎస్పీవిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 21న ఓపెన్ బిడ్ చేసి అర్హత కలిగిన ఎంపిక చేసినా సర్కారు కావాలని చేస్తున్న జాప్యంపై కేంద్రం కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం. అయితే ఇప్పుడు కొత్త కాంపోనెంట్స్ ను జత చేసి..మళ్ళీ టెండర్ పిలవాలనే ప్రతిపాదన కూడా పరిశీలిస్తున్నారని..అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఐఅండ్ఐ వర్గాలు చెబుతున్నాయి.