ఆంధ్ర్రపదేశ్ ప్రతిపక్ష వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తొలి మైలురాయిని అధిగమించింది. ఆయన పాదయాత్ర మంగళవారం ఉదయం వంద కిలోమీటర్లు దాటింది. అదే సమయంలో ఆయన తన సొంత జిల్లా కడప నుంచి కర్నూలులోకి అడుగుపెట్టారు. నవంబర్ 6న జగన్ ఇడుపుల పాయ నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కోర్టు లో హాజరు కోసం శుక్రవారం నాడు మాత్రం బ్రేక్ ఇచ్చారు. కర్నూలు జిల్లా చాగలమర్రి దగ్గర ఆయన పాదయాత్ర 100 కిలో మీటర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు చాగలమర్రి వద్ద గ్రామస్తులు స్వాగతం పలికారు.
వంద కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా జగన్...గొడిగనూరులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్‌ఆర్ జిల్లాలో పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర పూర్తి చేశారు. వైఎస్ఆర్ జిల్లాలో జగన్ 93.8 కిలో మీటర్లు నడిచారు. ప్రజాసంకల్పయాత్రలో 8వ రోజు అంటే మంగళవారం ఉదయం చాగలమర్రి మీదుగా వైఎస్ జగన్.. కర్నూలు జిల్లాలో అడుగుపెట్టారు. వైఎస్‌ఆర్ జిల్లాలో ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర...శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ సాగనున్న విషయం తెలిసిందే.