ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరో వైపు అధికార పార్టీ ఎమ్మెల్యే సీఎంవోలోని అధికారి తీరుపై రాజీనామా చేయటానికి సిద్ధమయ్యారు. దీంతో ఈ వ్యవహారం టీడీపీలో పెద్ద దుమారం రేపుతోంది. ఓ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ని కలవటానికి అధికారుల అనుమతి కావాలా?. సీఎం బిజీగా ఉండి తర్వాత కలుద్దాం అంటే అది వేరే సంగతి. కానీ అధికారే విషయం నాకు చెప్పు..సీఎంను కలవటం కుదరదు అని వ్యాఖ్యానించటం టీడీపీ ఎమ్మెల్యేలను విస్మయానికి గురిచేసింది. ఈ వ్యవహారం కాస్తా మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్లడంతో.. ఆయన కళా వెంకట్రావును రంగంలోకి దింపి... వంశీని బుజ్జగించే బాధ్యత అప్పగించారు. హనుమాన్ జంక్షన్‌లోని డెల్టా షుగర్స్ అంశంపై సీఎంవోలోని ఓ అధికారి తీరుతో మనస్తాపం చెందిన ఎమ్మెల్యే వంశీ తన రాజీనామా లేఖతో స్పీకర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఆ విషయాన్ని గమనించిన మరో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్... వంశీ వద్ద నుంచి రాజీనామా లేఖను తీసుకుని చింపివేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకు వెళ్లారు. డెల్టా షుగర్స్ ను హనుమాన్ జంక్షన్ నుంచి తణుకు ప్రాంతానికి తరలించాలనే ప్రతిపాదన ఉంది. అయితే తన నియోజకవర్గం నుంచి డెల్టా షుగర్స్‌ను తరలించవద్దని, అనేకమంది రైతుల జీవితాలు ఆధారపడి ఉన్నాయంటూ... ఈ విషయంపై ఎమ్మెల్యే వంశీ ఇవాళ కొంతమంది రైతులతో కలిసి ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు వెళ్లారు. అక్కడే వివాదం తలెత్తటంతో ఎమ్మెల్యే రాజీనామాకు సిద్ధపడ్డారు.