ఏడాదిలో పార్టీ ఆఫీసు..మరి రాజధాని!

Update: 2017-11-23 04:53 GMT

తెలుగుదేశం పార్టీ తన సొంత ఆఫీసుపై చూపిస్తున్న శ్రద్ధ రాజధాని ‘అమరావతి’పై చూపించటం లేదా?.. టీడీపీ  నేతల మాటలు చూస్తుంటే  అందరిలో ఇవే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఈ నెల26న మంగళగిరిలో నిర్మించతలపెట్టిన టీడీపీ రాష్ట్ర ఆఫీస్ ను ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీడీపీ నేతలు మీడియాకు తెలిపారు. ఇలా పార్టీ ఆఫీసు కట్టుకోవటం వల్ల ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ మూడున్నర సంవత్సరాల కాలం గడిచినా కూడా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ‘అమరావతి’కి సంబంధించి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు పనులు ఇంత వరకూ అడుగు ముందుకు పడలేదు. ఇవి వచ్చే ఏడాది మొదట్లో తప్ప ప్రారంభం అయ్యే అవకాశం కన్పించటం లేదు.  తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీలు నిర్మించినా అత్యంత లోపభూయిష్టంగా...నాసిరకంగా ఈ భవనాలు నిర్మించి సర్కారు అభాసుపాలు అయింది. ఇఫ్పటికీ ఇంకా వెలగపూడి సచివాలయ భవనాల్లో మరమ్మత్తులు సాగుతూనే ఉన్నాయి.

                                      రాజధానికి సంబంధించి చంద్రబాబు ఏ విదేశం పర్యటిస్తే ఆ దేశం మోడల్ గురించి ప్రకటించటం..మీడియాలో వాటికి విశేష ప్రాచుర్యం కల్పించటం చూశాం. మూడున్నరేళ్లు పూర్తయినా కనీసం రాజధానికి సంబంధించిన కీలక భవనాల డిజైన్లు కూడా సిద్ధం చేయకుండా జాప్యం చేసినా చంద్రబాబే ఇప్పుడు అధికారులపై ఆగ్రహం అని ప్రకటించటం ద్వారా తప్పంతా అధికారులపై నెట్టేసే ప్రయత్నం ప్రారంభించారు. అయితే రాజధాని నిర్మాణాలకు సంబంధించి విపరీత జాప్యం చేయటం వెనక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.  ఈ భవనాలను సగంలో ఉంచి..మళ్లీ మేం వస్తే ఇవి ముందుకు సాగవని రాజకీయ ప్రయోజనం పొందటం ఒకెత్తు..కేంద్రం సరిగా నిధులు ఇవ్వకపోయినా తామే కష్టపడి ఏదో చేస్తున్నామని కలరింగ్ ఇచ్చుకోవటం మరో ఎత్తుగా ఉందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. మరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే  ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే.

Similar News