ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కలకలం. అసలు ఉద్యోగుల వయోపరిమితి కుదింపు ప్రతిపాదనే లేదని కొద్ది రోజుల క్రితం బుకాయించిన సర్కారు..ఏకంగా ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ జీవోలను దొంగించాలరనే కారణంతోనే సెక్షన్ ఆఫీసర్ వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది. ఈ ప్రతిపాదన సిద్ధం చేసింది సాధారణ పరిపాలన శాఖ కాగా...సస్పెండ్ అయింది సాగునీటి శాఖకు చెందిన ఎస్ వో కావటం విశేషం. ప్రభుత్వ నిర్ణయంపై వెంకట్రామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు జీవోలే లేవని చెప్పినప్పుడు వాటిని దొంగిలించటం ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. పైగా ప్రభుత్వం అంతా ఈ జీవోలతో పాలన జరుపుతోందని..అలాంటప్పుడు జీవోలు దొంగిలించటం ఎలా సాధ్యం అవుతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు.
అయితే సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రభుత్వపక్షమే పనిచేస్తోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. సస్పెన్షన్ తర్వాత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ తానెలాంటి తప్పు చేయకపోయినా సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఎలాంటి విచారణకు అయినా సిద్ధమన్నారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు. అసలు 50 ఏళ్లకే ఉద్యోగుల పదవీ విరమణ ఆలోచన లేదని అంటున్నారని..అలాంటప్పుడు లేని జీవోని దొంగిలించానని తనపై సస్పెన్షన్ వేటు ఎలా వేస్తారని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు.