ఆయన పార్టీపై ఆయనకే నమ్మకం లేదా?. జనసేన నుంచి వెలువడుతున్న ప్రకటనలు చూసిన అభిమానులకు ఇదే అనుమానం వస్తోంది. బలం ఉన్న చోటే పోటీ అని ఓ సారి...అన్ని సీట్లకూ పోటీ అని ఓ సారి ప్రకటిస్తారు. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని మరో సారి చెబుతారు. జనసేనకు సంబంధించి ఎంత సేపూ ‘ట్రైలర్స్’ విడుదల అవుతున్నాయే తప్ప..అసలు సినిమా మాత్రం మొదలు కావటం లేదు. కొద్ది రోజుల క్రితం జనసేన సభ్యులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అక్టోబర్ నుంచి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారతానని బహిరంగంగా ప్రకటించారు. అక్టోబర్ పోయింది..నవంబర్ కూడా పూర్తి కావస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మళ్ళీ తన ఫుల్ టైమ్ పాలిటిక్స్ గురించి ఇంత వరకూ మరో ప్రకటన చేయలేదు. తాజాగా జనసేన ఏపీలో ఏర్పాటు చేయనున్న కార్యాలయానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని కూడా శాశ్వత భవనంగా కాకుండా..తాత్కాలికంగా..అద్దె స్థలంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించటం ఆసక్తికరంగా మారింది.
మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద దీని కోసం 3.42 ఎకరాల భూమిని మూడేళ్ళ పాటు అద్దెకు తీసుకోవటానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ భూమికి గాను నెలకు ఎకరాకు 50 వేల రూపాయలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. మరో వైపు పవన్ కళ్యాణ్ వచ్చేఎన్నికల్లో టీడీపీతో పొత్తుతోనే 30 నుంచి 40 సీట్లలో బరిలోకి దిగుతారని బలంగా ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు ప్రత్యేక హోదా విషయంలో గట్టిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఏపీలో తలపెట్టిన చలో అసెంబ్లీ విషయంలో కనీసం మద్దతు కూడా తెలపకుండా మౌనంగానే ఉండిపోయారు. అసలు జనసేన వ్యూహం ఏమిటో అంతుచిక్కకుండా ఉందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.