వింతే అయినా...ఇది వాస్తవం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం నాడు విజయవాడ కేంద్రంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. హేతుబద్దతలేని విభజన జరుగుతుంటే రాష్ట్ర భవిష్యత్ కోసం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి గట్టిగా పోరాడని ప్రశంసించారు. సోనియా, జగన్ కుమ్మక్కై విభజన చేస్తుంటే కిరణ్ కుమార్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కిరణ్ సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరిక సందర్భంగా చంద్రబాబు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషోర్ కుమార్ రెడ్డి వెయ్యి మంద అనుచరులతో కలసి వచ్చి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరారని చంద్రబాబు తెలిపారు. పీలేరు ఇక ఎన్నికలు వన్ సైడే జరుగుతాయన్నారు. కుప్పంతో పోటీ పడి పీలేరులో కూడా మంచి మెజారిటీ రావాలన్నారు. చిత్తూరు జిల్లాలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కుటుంబం నల్లారి కుటుంబం అని...నల్లారి కుటుంబం అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. నల్లారి కుటుంబం పీలేరు నియోజకవర్గానికి ఎంతో అవసరం అని పేర్కొన్నారు.
కిషోర్ కుమార్ రెడ్డిని పీలేరు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంటే కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి ఒంటికాలిపై లేచేవారు. ప్రతిపక్షంలో ఉండగా..చంద్రబాబుపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడూ ఏ రోజూ సఖ్యతతో ఉన్న దాఖలాలు కన్పించలేదు. కానీ ఓ సారి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా...ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి సర్కారుకు పరోక్షంగా మద్దతు ఇచ్చి ఓటింగ్ లో పాల్గొనకుండా గైర్హాజరు అయింది. అలా అప్పట్లో కిరణ్ సర్కారు కూలిపోకుండా కాపాడారు. అప్పట్లో ప్రభుత్వం కూలిపోతే జగన్ కు ప్రయోజనం అని భావించి చంద్రబాబు విమర్శలు ఎదురైనా సరే కిరణ్ సర్కారును కాపాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డిని బహిరంగంగా పొగడటంపై టీడీపీ శ్రేణులు కూడా అవాక్కు అవుతున్నాయి.