ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు రంగం సిద్దం అయింది. ఈ నెల 6 నుంచి ఇడుపులపాయ మీదుగా ఇచ్చాపురం వరకూ 13 జిల్లాల్లో ఈ పాదయాత్ర సాగనుంది. జగన్ తన పాదయాత్రతో మొత్తం 3000 కిలోమీటర్ల వరకూ కొనసాగనుంది. జగన్ రోజుకు 15 నుంచి 16 కిలోమీటర్ల మేర నడవనున్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీ డీజీపీకి రాసిన లేఖలోనే పేర్కొంది. జగన్ పాదయాత్రకు అనుమతి కోరటంతో పాటు..పాదయాత్ర వివరాలను తెలుపుతూ గురువారం నాడు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. భద్రతాపరంగా చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో కోరారు. ఈ పాదయాత్రకు ‘ప్రజా సంకల్పయాత్ర’ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఏడు నెలల పాటు జగన్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్ర సమయంలో ఆయా జిల్లాల్లో ఎంపీలతో పాటు..ఎమ్మెల్యేలు..ఇతర ప్రజా ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొననున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతోనే వైఎస్ జగన్ ఈ పాదయాత్రకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తో పాటు..చంద్రబాబునాయుడు కూడా పాదయాత్రతోనే ‘పవర్’లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదే ట్రెండ్ కొనసాగుతుందా? లేదా తెలియాలంటే 2019 వరకూ వేచిచూడాల్సిందే. ఇప్పటికే వైసీపీ ప్లీనరీలో ‘నవరత్నాల’ పేరుతో పలు పథకాలు ప్రకటించిన వైసీపీ నేత తన పాదయాత్ర ద్వారా వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు..చంద్రబాబు సర్కారు వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.