ఒకే రోజు. రెండు ఝలక్ లు. ఒకటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు. మరొకటి ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి. జగన్ ప్రతిష్టాత్మకంగా పాదయాత్ర ప్రారంభించిన వేళ వెలువడిన వార్త ఆ పార్టీ శ్రేణులను ఒకింత నిరాశకు గురిచేసింది. అయినా కూడా అది ఎక్కడా కన్పించకుండానే జగన్ పాదయాత్ర తొలి రోజు అట్టహాసంగా మొదలైంది. పనామా పేపర్ల తరహాలోనే తాజాగా ప్యారడైజ్ పేపర్లు బహిర్గతం అయ్యాయి. ఇందులో ప్రపంచంలోని పలు అగ్రనేతలతో పాటు భారత్ కు చెందిన వారి పేర్లు కూడా ఉన్నాయి. ఇండియాకు సంబంధించినంతవరకు 714 పేర్లు ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పేరు అందులో చోటు చేసుకుంది. ఏపీకి చెందిన జీఎంఆర్ వరకు ఆఫ్ షోర్ స్వర్గధామాల్లో లావాదేవీలు నెరిపినట్టు ఐసిఐజె తేల్చింది. పారడైజ్ పేపర్లలో పేర్లున్న ఇండియన్లు చాలావరకు కార్పొరేట్లు, కంపెనీల ముఖ్యులే. వారిలో కొంతమంది ఇప్పటికే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులను ఎదుర్కొంటున్నారు. అలాంటి పేర్లలో ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పన్ను ఎగవేత ద్వారా సొమ్ము దాచుకోవడానికి స్వర్గధామాలుగా భావించే దేశాలు, దీవుల్లో జరుగుతున్న లావాదేవీల రహస్యాలను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల అంతర్జాతీయ కన్షార్షియం (ఐసిఐజె) మరోసారి భారీ జాబితాను బయటపెట్టింది.
‘పారడైజ్ పేపర్ల’ పేరిట ఏకంగా కోటీ 34 లక్షల రికార్డులను బహిర్గతం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుయాయులనుంచి బ్రిటన్ రాణి వరకు ప్రపంచ స్థాయి నేతల పేర్లు అందులో ఉన్నాయి. జగన్ విషయం ఇది అయితే...ముఖ్యమంత్రి చంద్రబాబును ఓటుకు నోటు కేసు నీడలా వెంటాడుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన ఈ కేసులో సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఇది తెలుగుదేశం వర్గాలకు ఊహించని షాక్. ఓటుకు నోటు కేసు బయటపడి రెండున్నర సంవత్సరాలు అయినా తెలంగాణ ఏసీబీ ఈ కేసు ను సరిగా పట్టించుకోవటంలేదని ఆయన తన పిటీషన్ లో ఆరోపించారు. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నందునే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు పిటీషనర్ ఆరోపిస్తున్నారు. ఇలా ఒకే రోజు సీఎంకు..అపొజిషన్ లీడర్ లకు ఝలక్ లు తగిలాయి.