అందరి మదిలో ఇప్పుడు ఇదే అనుమానం. ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి డీజీపీగా సాంబశివరావు పేరును ప్రతిపాదిస్తూ ఏపీ ప్రభుత్వం రెండు సార్లు ప్యానల్ ను కేంద్రానికి పంపటం..కేంద్రం రెండు సార్లు ఆ జాబితాను తిరస్కరించటం తెలిసిందే. ఏడాదిన్నరపైగా సాంబశివరావును ఇన్ ఛార్జి డీజీపీగా పెట్టి..నెలన్నరలో పదవి విరమణకు ముందు ఈ పేరు పంపటం సరికాదని కేంద్రం తేల్చిచెప్పింది. కొత్త పేర్లతో జాబితా వస్తే తప్ప..వాటికి తీసుకోరాదని కేంద్రం ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. ఈ తరుణంలో ఏపీ సర్కారు పూర్తి స్థాయి డీజీపీగా సాంబశివరావును నియమిస్తూ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేంద్రంతో ఢీ కొట్టడానికి చంద్రబాబు రెడీ అయ్యారా?. లేక పదవి విరమణకు ముందు అయినా సాంబశివరావును పూర్తి స్థాయి డీజీపీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్న అంశంపై అధికార వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఏపీ ప్రభుత్వం పంపిన ప్యానల్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని..అందుకే దాన్ని తాము ఆమోదించలేమని కేంద్రంలోని అధికారుల వాదన. రెండు సార్లు జాబితా పంపించి..కేంద్రం నో అన్న తర్వాత సాంబశివరావును పూర్తి స్థాయి డీజీపీగా నియమించిన వైనం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల సమయానికి సాంబశివరావే డీజీపీగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఈ ప్రయత్నాలకు కేంద్రం అడ్డుచక్రం వేసింది.
ఏపీ ప్రభుత్వ తాజా ఆదేశాలతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈ నిర్ణయానికి ముందు ఢిల్లీ స్థాయిలో ఏపీ ప్రభుత్వం సాంబశివరావు పేరును ఓకే చేయించేందుకు గట్టి లాబీయింగే చేసింది. కానీ అవేమీ ఫలితాన్ని ఇవ్వలేదు. సాంబశివరావు మరో రెండేళ్ళు కొనసాగేలా ప్రభుత్వమే డిసెంబర్ తర్వాత కోర్టులో పిటీషన్ వేసే అవకాశం కూడా ఉందని ఓ ఉన్నతాధికారి సూచన ప్రాయంగా తెలిపారు. అందుకు ఆయన సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సూచిస్తున్నారు. గత కొంత కాలంగా ప్రధాని నరేంద్రమోడీ..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిల మధ్య ‘దూరం’ పెరిగిందనేది బహిరంగ రహస్యం. ఏపీకి చెందిన అత్యంత కీలకమైన పోలవరం , ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించటం లేదని చంద్రబాబు గుర్రుగా ఉన్నారు. అయినా గట్టిగా మాట్లాడే సాహసం చేయటంలేదు. అయితే తాజాగా డీజీపీగా సాంబశివరావు నియామకం ద్వారా ప్రధాని మోడీతో ఢీకొట్టడానికే రెడీ అయినట్లు కన్పిస్తోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. మరి కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. అయితే ఏపీ సర్కారు ప్యానల్ పంపిన తర్వాత కూడా సాంబశివరావు మొదలుకుని అందరికి సంబంధించిన నివేదికలను కేంద్రం తెప్పించుకుంది.