లూలూ గ్రూప్ తో చంద్రబాబు లాలూచీ..ప్రైవేట్ సంస్థకు బెదిరింపులు!

Update: 2017-11-13 04:07 GMT

దుబాయ్ కి చెందిన లూలూ గ్రూప్ తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అంత లాలూచీ ఉందా?. అంటే అవునంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.  దుబాయ్ కు చెందిన లూలూ గ్రూప్ అనే ఓ ప్రైవేట్ సంస్థ కోసం ఏపీ సర్కారు ఏకంగా బ్లాక్ మెయిల్ కు దిగిన వ్యవహారం అధికార వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మౌలికసదుపాయాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అజయ్ జైన్ అసలు అది నిబంధనలకు అనుకూలంగా ఉందా? లేదా అనే అంశాలను ఏ మాత్రం పరిశీలించకుండా  అడ్డగోలుగా జీవోలు జారీ చేస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంత కాలం భూ దందాలు..కబ్జాలు ప్రైవేట్ వ్యక్తులే చేయటం మనకు తెలుసు. కానీ ఇప్పుడు సర్కారు కూడా బ్లాక్ మెయిల్ భూ దందా చేస్తోంది. మర్యాదగా నీ భూమి మాకిచ్చి..మేమిచ్చిన చోట భూమి తీసుకుంటావా?. లేకపోతే భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చి లాగేసుకోమంటావా? తేల్చుకో. ఇదీ ఓ ప్రైవేట్ సంస్థకు సర్కారు ఇఛ్చిన థమ్కీ. అంటే సర్కారు కూడా అచ్చం భూ దందాలు చేసే వారి తరహాలో బ్లాక్ మెయిల్ కు పాల్పడుతుందన్న మాట. అంతే కాదు సుమా..అసలు ప్రభుత్వం సూచించే భూ మార్పిడి స్కీమ్ కు ప్రైవేట్ వ్యక్తి/సంస్థ అంగీకరిస్తారా? లేదా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ‘సమయం ఆదా’ కోసం అంటూ ఏకంగా జీవో జారీ చేసి మరీ  రిక్విజన్  ఫర్ ప్రాజెక్ట్ (ఆర్ఎఫ్ పి)తో ముందుకు సాగాలని ఆదేశించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

                                          అంతే కాదు సర్కారు పెద్దలు  అనుకున్నట్లు ఈ ప్రాజెక్టును లూలూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ లిమిటెడ్ కు అప్పగించాలని నిర్ణయించారు. ఈ సంస్థ విశాఖపట్నంలోని హార్బర్ పార్క్ ప్రాంతంలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ తో పాటు ఎగ్జిబిషన్ మాల్స్, మీటింగ్ హాల్స్, పార్కింగ్ ప్లేస్, స్టార్ హోటల్, రిటైల్ మాల్ కట్టాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అప్పగింతలో పలు ఉల్లంఘనలు ఉన్నాయి. వాటిని కూడా జీవో రూపంలో ఓకే చేసేశారు. ప్రభుత్వ అవసరాల కోసం భూమి తీసుకోవటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ఏకంగా ఓ దుబాయ్ కి చెందిన బడా వ్యాపార సంస్థ వ్యాపారం కోసం రాష్ట్రానికి మరో ప్రైవేట్ సంస్థకు చెందిన భూమిని బలవంతంగా లాక్కోవాలని చూడటం వెనక మతలేమిటో ఊహించుకోవటం పెద్ద కష్టం కాదు. వైజాగ్ లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ కట్టడాన్ని కూడా ఎవరూ ఆక్షేపించరు. కానీ అందుకు చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న తీరు  ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అంటున్నారు. ప్రభుత్వం చేతిలో దాదాపు పది ఎకరాలు ఉండగా..ప్రైవేట్ సంస్థకు చెందిన మూడున్నర ఎకరాలను బలవంతంగా తీసుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి.

Similar News