రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఎప్పుడూ చూడని పరిస్థితిని చూస్తున్నారు. సభలు..సమావేశాలు ..ధర్నాలు అంటూ చాలు నో పర్మిషన్ అంటున్నారు. బంద్ కు వ్యతిరేకంగా కూడా ప్రభుత్వంలో రంగంలోకి దిగి వాటిని ఫెయిల్ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణలో ఒకప్పుడు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం ఎక్కడికి వెళితే అక్కడ పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేస్తున్నారు. ఆయన తలపెట్టిన సమావేశాలకు పోలీసులు నో చెబుతున్నారు. రాజకీయ పార్టీల విషయంలోనూ ఇదే పద్దతి ఫాలో అవుతున్నారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు..ప్రజా సంఘాలు పలు ఉద్యమాలకు పిలుపు ఇవ్వటం సహజమే. కానీ వాటిని సర్కార్లు దారుణంగా అణచివేస్తున్నాయి. అచ్చం తెలంగాణలో ఎలా జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ లోనూ అదే ఫాలో అవుతున్నారు.
‘ప్రత్యేక హోదా’ కోసం వామపక్షాలు..ఉద్యమ నాయకులు సోమవారం చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇవ్వటంతో ఆదివారం రాత్రి నుంచే నేతలు అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక హోదా చలో అసెంబ్లీ ముట్టడికి ప్రతిపక్ష వైసీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు పలికాయి. కానీ పోలీసులు ఎక్కడికి అక్కడే ముందే నేతలను అదుపులోకి తీసుకుని అసలు కార్యక్రమమే జరక్కుండా అడ్డుకుంది. విభజన సమయంలో ఏపీకి దక్కాల్సిన న్యాయమైన డిమాండ్ ను ప్రజా సంఘాలు...పార్టీలు ప్రస్తావిస్తున్నా ప్రభుత్వం ఆ విషయం దిశగా ప్రయత్నించాల్సింది పోయి...హోదా కోరిన వారిని అణచివేస్తోంది.