రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా?. అంటే అవునంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులపై కేంద్రం ‘నజర్’ వేసింది. ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం క్షణాల్లోనే ఢిల్లీకి చేరుతోంది. ‘పోలవరం’ రగడ మొదలైప్పటి నుంచి ఇది మరింత పెరిగిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరానికి కేంద్రం నిధులు ఇస్తోంది. అది ఎంత...ఎలా అన్న దానిపై వివాదాలు ఉన్నా... కేంద్రం ఇచ్చే నిధుల వినియోగం..ప్రాజెక్టు అంచనాలపై కాగ్ నివేదికలు... సీవీసీల నజర్ ఉండటం సహజం. ప్రస్తుతం పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం చాలా సీరియస్ గా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం పనులను ఇష్టం వచ్చినట్లు ఏపీ సర్కారు మార్చేసి..తనకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఇవ్వటం సాధ్యంకాదని..ప్రతి దానికి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
అసలు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం విషయంలో ఏపీ కేబినెట్ సొంత నిర్ణయాలు ఎలా తీసుకుంటుందని ఢిల్లీలోని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. సీఎంవోలోని అధికారులు కొంత మంది నిబంధనలు పక్కన పెట్టి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని..అదే సమయంలో వారు ఇతర అధికారులపై ఒత్తిడి తెస్తున్న వైనం కూడా కేంద్రానికి చేరింది. ఏపీ రాజధాని అమరావతిలో చోటుచేసుకుంటున్న వ్యవహారాలు మొదలుకుని...పోలవరం, ఇతర సాగునీటి ప్రాజెక్టు వ్యవహారాలు..ఏపీలో సాగుతున్న పరిణామాలపై కేంద్రంలోని ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు ఉండబోతున్నాయని..అవి ఖచ్చితంగా ఢిల్లీ నుంచే వస్తాయని చెబుతున్నారు. ఇవి గతంలో ఎన్నడూ లేరి రీతిలో ఉంటాయని సమాచారం.