ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు శుక్రవారం నాడు ప్రారంభం అయ్యాయి. ఈ సారి సమావేశాలకు ఓ ప్రత్యేకత ఉంది. సభలో ప్రతిపక్షం లేకుండా అధికారపక్షంతోనే సమావేశాలు సాగనున్నాయి. ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే తప్ప తాము సభకు హాజరుకాబోమని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను చంద్రబాబు ఏకంగా కేబినెట్ లోకి తీసుకుని..ఆ మంత్రులతో తమ ప్రశ్నలకు సమాధానం ఇప్పిస్తే తాము చూస్తూ కూర్చుంటామా? అని వైసీపీ ప్రశ్నిస్తోంది. కేవలం చంద్రబాబు తీరును ఎండగట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతుంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకుంటే సభకు హాజరు కావటానికి తమకు ఏ మాత్రం అభ్యంతరం లేదని చెబుతోంది. అయితే ఇది జరిగే విషయం కాదనే అందరికీ తెలిసిందే.
కావాలని రాజకీయంగా దెబ్బతీయాలనే లక్ష్యంతో వైసీపీ ఎమ్మల్యేలను చేర్చుకున్న టీడీపీ అనర్హత వేటు వేయటం అనే ప్రశ్నే ఉండదు. దీంతో వైసీపీ సమావేశాలు అంతటికి దూరంగా ఉండటం ఖాయంగా కన్పిస్తోంది. అయితే ఫిరాయింపుల అంశంపై ఈ కారణంగా బాగా చర్చ జరుగుతుందని..అది చంద్రబాబుకు ఖచ్చితంగా నష్టం చేకూరుస్తుందని భావిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాబోమని ప్రకటించటంతో ..సోషల్ మీడియాలో జోకులు కూడా పేలుతున్నాయి. ఎలాగూ 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు దగ్గరే ఉన్నారు కాబట్టి వాళ్ళతో సభ నడిపించేస్తారని..అదే వైసీపీ అని సర్దుకుంటారనే కామెంట్లు వస్తున్నాయి.