రాడార్ కూడా ధ్వంసం

Update: 2026-04-03 15:11 GMT

 అమెరికా, ఇజ్రాయెల్ లు ఎంత భీకరంగా దాడులు చేస్తున్నా కూడా ఇరాన్ కూడా అంతే స్థాయిలో అగ్రరాజ్యం అమెరికాకు చుక్కలు చూపిస్తోంది. మరో వైపు ఇజ్రాయెల్ పై కూడా ఏ మాత్రం గ్యాప్ లేకుండా దాడులు చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ లు తాజాగా ఇరాన్ కు చెందిన అతి పెద్ద బ్రిడ్జి ను కూల్చేశాయి. పశ్చిమాసియాలోనే ఇది అతి పెద్ద బ్రిడ్జి గా ఉంది. రానున్న రోజుల్లో ఇరాన్ పై దాడుల తీవ్రత పెంచుతామని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత ఈ దాడులు జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. ముందు బ్రిడ్జి లు కూల్చేసి తర్వాత ఇరాన్ లో విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ కూడా అదే చేస్తే తాము వేటిపై దాడులు చేస్తామో చెపుతూ ఒక లిస్ట్ విడుదల చేసింది. మరో వైపు అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా గల్ఫ్ లోని రిఫైనరీలపై దాడులకు దిగింది.

                                   ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే అమెరికాకు చెందిన అధునాతన ఎఫ్-35 ఫైటర్ జెట్ ను ఇరాన్ కూల్చేసింది. దీంతో ఇప్పటి వరకు ఇరాన్ అమెరికాకు చెందిన రెండు పవర్ ఫుల్ జెట్ ఎఫ్ 35 లను కూల్చేసినట్లు అయింది. ఇటీవల కూల్చేసిన ఎఫ్ 35 జెట్ ఫైటర్ కు చెందిన పైలట్ ఇరాన్ దళాలకు చిక్కినట్లు ప్రచారం జరుగుతోంది. మరో వైపు కూలిపోయిన ఫైటర్ జెట్ పైలట్ కూడా మరణించి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ అంశంపై అమెరికా ఎక్కడా అధికారికంగా స్పందించలేదు. అయితే ఇరాన్ మాత్రం తమ గగనతలంలోకి ప్రవేశించిన విమానాన్ని సెంట్రల్ ఇరాన్ ప్రాంతంలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థతో అడ్డుకున్నామని తెలిపింది. మరో వైపు ఇరాన్ అమెరికా కు చెందిన అత్యంత ఖరీదైన రాడార్ వ్యవస్థను కూడా దారుణంగా దెబ్బతీసింది.

                                        రెండు ఎఫ్ 35 ఫైటర్ జెట్ లు, రాడార్ వ్యవస్థలు..ఇలా అమెరికాకు ఆర్థికంగా ఇరాన్ భారీ నష్టం చేస్తున్నట్లు నివేదికలు బయటకు వస్తున్నాయి. మరో వైపు అమెరికాకు సహకరిస్తున్న గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్ దాడుల కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. రాబోయే రోజులు యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తుంది అని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వేళ అమెరికాలోని కీలక సైనిక అధికారులపై వేటు పడటం కలకలం రేపుతోంది. డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు అందరిని షాక్ కు గురి చేస్తున్నాయి. ఇరాన్ పై చేస్తున్న యుద్ధం నుంచి అమెరికా గౌరవంగా బయటపడే సూచనలు ఏ మాత్రం కనపడటం లేదు అని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News