గోల్డ్ మార్కెట్ లో జోష్ మళ్ళీ మొదలు అయ్యేది ఎప్పుడు?. వరసగా తగ్గుతున్న బంగారం ధరలు మళ్ళీ కొత్త గరిష్ట స్థాయిలకు చేయటానికి ఎంత సమయం పడుతుంది?. ఇవే ఇప్పుడు బంగారం కొనుగోలుదారులకు ఎదురవుతున్న ప్రశ్నలు. అవసరాల కోసం కొనుగోలు చేసుకున్న వాళ్లకు పెద్దగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ పెట్టుబడిగా బంగారం కొనుగోలు చేసి...గరిష్ట స్థాయిలో విక్రయించుకోవాలని చూసేవాళ్ళు మాత్రం 2028 చివరి వరకు ఎదురుచూడాల్సిందే అని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ లు మొదలు పెట్టిన యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ద్రవ్యోల్భణం గణనీయంగా పెరిగింది. దీనికి అగ్రరాజ్యం అమెరికా కూడా ఏ మాత్రం మినహాయింపు కాదు. పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు అమెరికా ఫెడ్ డిసెంబర్ లో మరో సారి వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. ఇండియా లో కూడా ఇదే పరిస్థితి. తాజాగా వెల్లడైన లెక్కల ప్రకారం చూసుకుంటే దేశం లో కూడా ద్రవ్యోల్భణం కొత్త గరిష్ఠాలను తాకింది. దీంతో రాబోయే రోజుల్లో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ ) ఖచ్చితంగా వడ్డీ రేట్లు పెంపు దిశగా నిర్ణయాలు తీసుకోవటం పక్కా అని చెపుతున్నారు.

                          పెరుగుతున్న ధరలతో సతమతం అవుతున్న తరుణంలో బంగారం లో పెట్టుబడులు పెట్టే వాళ్ళు తగ్గుముఖం పడతారు. దీంతో గోల్డ్ మార్కెట్ లో జోష్ రావాలంటే ద్రవ్యోల్భణం తగ్గుముఖం పట్టడంతో పాటు కీలక దేశాల్లో వడ్డీ రేట్లు కూడా తగ్గాల్సి ఉంటుంది. ఇది జరగాలంటే దగ్గర దగ్గర రెండేళ్ల సమయం పడుతుంది అని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్ మన్ శాక్స్ అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు గతంలో నమోదైన రికార్డు గరిష్ఠ స్థాయిల కంటే బాగా దిగువన ట్రేడవుతున్నాయి. మళ్లీ పాత గరిష్ఠ స్థాయిలను చేరుకోవడానికి మరో రెండేళ్ల సమయం పట్టవచ్చని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేస్తోంది. నవంబర్ 16న లీనా థామస్ నేతృత్వంలోని గోల్డ్‌మన్ శాక్స్ విశ్లేషకులు విడుదల చేసిన నివేదికలో.. సమీప భవిష్యత్తులో బంగారం ధరలు మరింత బలహీనపడటంతో పాటు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇందుకు పలు అంశాలను ప్రస్తావించారు. ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానాన్ని మరింత కఠినతరం చేయడం వల్ల బంగారంపై ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్లేషించారు.

                                   ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించిన తర్వాత పాశ్చాత్య దేశాల్లోని గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF)లో పెట్టుబడుల డిమాండ్ తిరిగి పుంజుకుంటుందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేస్తోంది. దీని ఫలితంగా 2028 చివరి నాటికి ఔన్స్ బంగారం ధర 5,600 డాలర్లకు చేరుకుంటుందని పేర్కొంది. స్థూల ఆర్థిక విధానాలపరమైన రిస్కుల నుంచి రక్షణ పొందేందుకు పెట్టుబడిదారులు మళ్లీ బంగారం వైపు మొగ్గుచూపితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తన నివేదికలో తెలిపింది. ఈ ఏడాది జనవరి చివరి నాటికి ఔన్స్ బంగారం ధర దగ్గర దగ్గర 5,600 డాలర్ల రికార్డు గరిష్ఠ స్థాయిని తాకింది. ఆ తర్వాత నుంచి ధరలు 30 శాతానికి పైగా తగ్గాయి. ఇటీవల 4,000 డాలర్ల స్థాయి కంటే కూడా దిగువకు పడిపోయాయి. ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచవచ్చన్న ఆందోళనలు, అమెరికా డాలర్ మరింత బలపడటం ఇందుకు కారణాలుగా నిలిచాయి. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం ధరలు దాదాపు 11 శాతం తగ్గుముఖం పట్టాయి. దీంతో గత దశాబ్ద కాలంలోనే అత్యంత దారుణమైన వార్షిక పతనాన్ని నమోదు చేసే దిశగా పయనిస్తున్నాయి.

                                 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ ) రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు, బాండ్లపై రాబడులు పెరగడం, వడ్డీ రేట్లు మరింత ఎక్కువగా ఉండవచ్చన్న అంచనాలు బంగారంపై డిమాండ్‌ను తగ్గించాయి. గత చరిత్రను పరిశీలిస్తే.. 2027 సంవత్సరం బంగారం ధరల విషయంలో 2022 మాదిరిగానే ఉండవచ్చని గోల్డ్‌మన్ శాక్స్ తన నివేదికలో పేర్కొంది. పెరుగుతున్న వడ్డీ రేట్లు ప్రైవేట్ పెట్టుబడిదారుల నుంచి బంగారానికి వచ్చే డిమాండ్‌ను తగ్గిస్తాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం వల్ల ధరలు మరింత పడిపోకుండా అడ్డుకుంటుందని అంచనా వేసింది. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్ల మద్దతుతో 2027 చివరి నాటికి ఔన్స్ బంగారం ధర మళ్లీ 4,650 డాలర్లకు చేరుకుంటుందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేస్తోంది. పలు దేశాల్లో అంచనాల కంటే అధికంగా నమోదైన ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో, వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియ ఎక్కువ కాలం కొనసాగవచ్చని కూడా మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Full View

Tags: