కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ సారి పెద్ద దుమారమే రేపింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి మేలు చేసేలా సర్ చేపట్టారని..కోట్ల సంఖ్యలో ఓటర్లను తొలగించారు అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ తో పాటు ఇతర కీలక పార్టీ లు అన్నీ కూడా సర్ జరిగిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీం కోర్ట్ కు కూడా చేరింది. సర్ పేరుతో అడ్డగోలుగా ఓటర్లను తొలగించి బీజేపీ గెలుపు కోసం సిఈసి జ్ఞానేష్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు అని విపక్షాలు ఆరోపిస్తుంటే ...చనిపోయిన వ్యక్తులతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి ఓట్లు మాత్రమే తొలగించినట్లు బీజేపీ వాదిస్తోంది. అయితే బయటకు వచ్చిన పలు నివేదికల ప్రకారం చూస్తే సిఈసి సర్ పేరుతో గోల్ మాల్ చేసింది అనే అనుమానాలు ప్రజల్లో కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే కేంద్రంలోని మోడీ సర్కారు ఇప్పుడు అత్యంత కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నాడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో కూడా దీనికి ఆమోదం తెలిపారు.
నియోజకవర్గాల పునర్విభజన తో పాటు మహిళా బిల్లు అమలుకు మార్గం సుగమం చేసేందుకు తలపెట్టిన ఈ బిల్లుల కోసమే నవంబర్ 30 న లోక్ సభ ప్రారంభం అవుతుంటే , డిసెంబర్ 2 నుంచి రాజ్య సభ ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఎలాంటి ఇతర ఎజెండా లేకుండా కేవలం ఈ బిల్లుల కోసమే సభ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిపాదిత బిల్లు ప్రకారం ప్రస్తుతం ఉన్న లోక్ సభ స్థానాలను అన్ని రాష్ట్రాల్లో 50 శాతం మేర పెంచనున్నారు. ఈ లెక్క ప్రకారం ప్రస్తుతం 543 ఉన్న లోక్ సభ సీట్ల సంఖ్య 815 కు చేరనుంది. గతంలో ఈ బిల్లులను ఆమోదించుకోవటంలో విఫలం అయిన మోడీ సర్కారు ఈ సారి మాత్రం విజయం సాధించి తీరతామని ధీమాతో ఉంది. అదే జరిగితే ఇప్పుడు మరో సారి సిఈసి జ్ఞానేష్ కుమార్ పాత్ర అత్యంత కీలకం అవుతుంది. అది ఎలా అంటే సహజంగా డీలిమిటేషన్ కమిషన్ లో ముగ్గురు కీలక సభ్యులు ఉంటారు. కమిషన్ కు పదవి లో ఉన్న సుప్రీం కోర్ట్ జడ్జి లేదా పదవి విరమణ చేసిన సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి చైర్మన్ గా ఉంటారు. సిఈసి లేదా ఆయన సూచించిన ఎలక్షన్ కమిషనర్ సభ్యుడుగా అంటారు. వీళ్ళిద్దరితో పాటు ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. వీళ్ళతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ఎంపీలు...ఎమ్మెల్యేలను అసోసియేట్ సభ్యులుగా నియమిస్తారు.
అసోసియేటెడ్ సభ్యులు చర్చల్లో పాల్గొని తమ సలహాలు...సూచనలు ఇవ్వగలరు కానీ..నిర్ణయాలు తీసుకోవటంలో వీళ్ళ పాత్ర ఏమీ ఉండదు. కథ అంతా నడిపించేది కమిషన్ లోని ముగ్గురు కీలక సభ్యులే. ఈ తరుణంలో మోడీ సర్కారు డీలిమిటేషన్ కమిషన్ లో తమకు ఎంతో అనుకూలంగా ఉన్నాడు అని పేరున్న జ్ఞానేష్ కుమార్ వైపే మొగ్గు చూపుతుందా లేక వివాదాలకు ఛాన్స్ లేకుండా సిఈసి సిఫారసు చేసిన కమిషనర్ ను సభ్యుడిగా పెట్టడానికి ఆసక్తి చూపుతుందా అన్నది ఇప్పుడు అత్యంత కీలకంగా మారనుంది. నేరుగా జ్ఞానేష్ కుమార్ ఉన్నా ..ఆయన సిఫారసు చేసిన వ్యక్తులు ఉన్నా బీజేపీ కి పెద్దగా తేడా ఏమీ ఉండదు అని..మిగిలిన పక్షాలు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే సర్ తరహా రచ్చ తప్పదు అనే చర్చ తెర మీదకు వస్తోంది. గతంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీలు తమకు అనుకూలంగా పలు మార్పులు...చేర్పులు చేసుకున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు బీజేపీ మాత్రం అలా చేయకుండా ఎందుకు వదిలేస్తుంది అన్న అన్న చర్చ తెర మీదకు వస్తోంది.