Full Viewప్రపంచంలోనే ఏ మాత్రం నైతికత లేని రాజకీయ వ్యాపారి ఎవరైనా ఉన్నారంటే అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పేరు ముందు వరసలో ఉంటుంది అనే చెప్పొచ్చు. అధికారంలో ఉన్న వాళ్ళు దాన్ని అడ్డంపెట్టుకుని ఎంతో కొంత ప్రయోజనం పొందుతారు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. కానీ డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ విషయంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటారు. బహుశా ట్రంప్ చేసినంత దారుణంగా గతంలో ఏ అమెరికా ప్రెసిడెంట్ చేసి ఉండరు అనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు ప్రతిదీ వ్యాపారమే అన్న అభిప్రాయం ఇప్పటికే ఆ దేశ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది . ఇరాన్ యుద్ధం దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ పునర్నియామకం విషయం వరకూ ఆయన ఆర్థిక కోణంలోనే ఆలోచిస్తారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇరాన్ యుద్ధం సమయంలో కూడా డోనాల్డ్ ట్రంప్ అటు ఆయిల్ కు సంబంధించిన డీల్స్ తో పాటు పలు రక్షణ రంగ కంపెనీల షేర్లలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అప్పటిలో ఇవి పెద్ద ఎత్తున దుమారం రేపినా కూడా డోనాల్డ్ ట్రంప్ మాత్రం డోంట్ కేర్ అన్నట్లు తాను అనుకున్నట్లు చేసుకుంటూ వెళ్లారు. యుద్ధ సమయంలో రక్షణ రంగ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు గడించారు. ఆయిల్ డీల్స్ తో కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం పొందారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ లో డోనాల్డ్ ట్రంప్ ఆలా పోస్ట్ పెడితే చాలు...అటు ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ లతో పాటు ఆయిల్ మార్కెట్ లు కూడా స్పందించేవి. వీటిని తనకు అనుకూలంగా మార్చుకుని పెద్ద ఎత్తున లాభం గడించారు. ఇప్పుడు ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ను తిరిగి నియమించటం వెనక డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఆయన కూడా దృవీకరిస్తున్నారు.

                               ఎన్విడియా బోర్డు సభ్యులతో నేరుగా ...పరోక్షంగా చర్చలు జరిపినట్లు తెలిపారు. అంతే కాకుండా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జె డీ వాన్స్ అండ్ టీం కంపెనీ బోర్డు తో మాట్లాడి సీఈఓ గా తిరిగి జెన్సన్ ను నియమించేలా ఒప్పించటంలో కీలక పాత్ర పోషించారు. ఇది అంతా కూడా పైకి దేశ ప్రయోజనాల కోసం...కంపెనీ భవిష్యత్ కోసం అని చెపుతున్నారు. అదే సమయంలో డోనాల్డ్ ట్రంప్ కు దీని ద్వారా వ్యక్తిగతంగా కూడా భారీ ప్రయోజనం దక్కింది. అది ఎలాగంటే ఎన్విడియా లో డోనాల్డ్ ట్రంప్ కు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉన్నాయి. జెన్సన్ హువాంగ్ ను కంపెనీ సీఈఓ ని తిరిగి నియమించినట్లు అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే కంపెనీ షేర్లు దూసుకెళ్లాయి. దీంతో ఒక్క రోజులోనే డోనాల్డ్ ట్రంప్ కు 130 కోట్ల రూపాయల మేర లాభం వచ్చింది. అదే సీఈఓ జెన్సన్ కు అయితే ఈ లాభం 3 .15 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. చైనాకు చెందిన స్పై గా అనుమానిస్తున్న అలైస్ హువాంగ్ తో పాటు కంపెనీ ఉద్యోగులతో అక్రమ సంబంధాలు ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత జెన్సన్ తన పదవి వీడాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.

                                    ఇది జరిగిన తర్వాత అటు కంపెనీ ఉద్యోగులతో పాటు ఒక వైపు డోనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ లు జెన్సన్ ను తిరిగి సీఈఓ గా తీసుకోవాలని బహిరంగంగా కోరారు. అయితే ఎన్విడియా బోర్డు మాత్రం అది ముగిసిపోయిన విషయం అని..ఆ ఛాన్స్ లేదు అంటూ ప్రకటించింది. కొత్త సీఈఓ వేట మొదలు పెట్టినట్లు కూడా వెల్లడించారు. కానీ రోజులు గడవకముందే మొత్తం రివర్స్ అయింది. సడన్ గా కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా జెన్సన్ ను మళ్ళీ సీఈఓ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కంపెనీ బోర్డు పై ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తో పాటు మొత్తం అమెరికా సర్కారు ఎంత ఒత్తిడి తెచ్చిందో అర్ధం అవుతోంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే జాతీయ భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి పనులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఏమీ జెన్సన్ చేయలేదు అని చెప్పటమే కాకుండా ఈ దిశగా ప్రభుత్వానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు అని కంపెనీ బోర్డు కు ట్రంప్ నియమించిన టీం హామీ ఇవ్వటం ఇక్కడ హై లైట్ గా చెప్పుకోవచ్చు.

                                        బోర్డు సభ్యులతో వ్యక్తిగతంగానూ ట్రంప్ టీం చర్చలు జరిపి ఒప్పించారు అంటే దీని వెనక ఎంత కథ నడిచిందో అర్ధం అవుతోంది. జెన్సన్ రీ ఎంట్రీ కంపెనీ కే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో మేలు చేస్తుంది అని డోనాల్డ్ ట్రంప్ చెపుతున్నారు. జెన్సన్ రాజీనామా తర్వాత ఏఐ రంగంలో అమెరికా అధిపత్యానికి గండిపడుతోంది అనే భయంతో పాటు ఈ పరిణామాల తర్వాత నాస్ డాక్ ఇండెక్స్ పది శాతం మేర పతనం అవటం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా ప్రభుత్వం ఈ విషయంలో గట్టిగా ప్రయత్నాలు చేయటమే కాకుండా...తమ వల్లే కంపెనీ బోర్డు ఇందుకు ఒప్పుకుంది అని చెప్పుకుంటుంది కూడా. ఈ పరిణామాలు అన్నీ రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో చూడాలి.

Tags: